రజిత ఆవేదన కరెక్టేగా

టాలీవుడ్ దర్శకులు ఈ మధ్య ఎదురుకుంటున్న సమస్య లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులను వెతికి పట్టుకోవడం. నిన్న జరిగిన దొంగ నా కొడుకు టీజర్ లాంచ్ లో నటి రజిత మాట్లాడుతూ ఖుష్బూ, నదియా లాంటి వాళ్ళను ఏ క్యాటగిరీలో ఉంచి, తమను బి క్యాటగిరీలో అయినా పెట్టి అవకాశాలు ఇస్తే బాగుంటుందని అడిగారు. నటించేందుకు సిద్ధంగా ఉన్న తనలాంటి తెలుగు నటీమణులు ఎందరో ఉన్నారని వాళ్ళను గుర్తించాలని కోరుకున్నారు. ఆవిడ అన్నదాంట్లో తప్పుబట్టడానికి ఏం లేదు. నిజమే.

ఎందుకంటే గత కొన్నేళ్లుగా మన దర్శకులు ప్యాన్ ఇండియా పేరుతో ఇతర భాషల ఆర్టిస్టులను తీసుకురావడం ఎక్కువయ్యింది. రెమ్యునరేషన్లు భారీగా పుచ్చుకుంటున్నా సరే వెతికి మరీ తీసుకొస్తున్నారు. ఓసారి ఏకంగా అమెరికాలో సెటిలైనావిడని పిలిపించి బోలెడంత ఖర్చు పెట్టుకున్నారు నిర్మాత. తీరా చూస్తే బొమ్మ డిజాస్టర్ అయ్యింది. ఇరవై ఏళ్ళ క్రితం నాగార్జున హిట్ మూవీలో నటించిందన్న కారణంతో, వింటేజ్ వైబ్ వస్తుందని పిలుచుకొస్తే నీరసం ప్రో మ్యాక్స్ అయ్యింది.

తిరిగి సదరు నటి మళ్ళీ హైదరాబాద్ కు వస్తే ఒట్టు. నిన్నటి ఇప్పటి తరంలో రజిత లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా మంది అందుబాటులో ఉన్నారు. సరైన రీతిలో వాడుకుంటే పాత్రలను నిలబెడతారు. తమిళ, హిందీవాళ్ళ తాకిడి ఎక్కువ కావడం వల్లే వీళ్లకు అవకాశాలు తగ్గడం వాస్తవమే. అత్త, అమ్మ, వదిన క్యారెక్టర్లకు కూడా గ్లామర్ టచ్ ఉన్న ఏజ్ బార్ ఆర్టిస్టులు కావాలనుకోవడంతో ఈ సమస్య అంతకంతా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. అందుకే రజిత తన స్వరం వినిపించారు.

ఇకనైనా ఈ విషయం గురించి ఇండస్ట్రీ పెద్దలు సీరియస్ గా ఆలోచించాలి. ఎప్పుడో చివరి దశలో ఆర్టిస్టులను చూసి అయ్యో పాపం అనుకోవడం కన్నా వాళ్ళు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నప్పుడే వేషాలు ఇస్తే ఆర్థికంగా కూడా బలపడతారు. అంతే తప్ప కోట్లకు కోట్లు పారితోషికాలు ఇచ్చి చెన్నై, ముంబై నుంచి తీసుకొచ్చినంత మాత్రాన బ్లాక్ బస్టర్లు పడవు. దీన్ని అర్థం చేసుకునేవాళ్ళు చాలా తక్కువ మంది. ఆచరిస్తే నిర్మాణ సంస్థలకు కూడా వ్యయం తగ్గి బడ్జెట్ పరంగా సేఫ్ అవుతారు.