నాగార్జున పదే పదే హెచ్చరిస్తున్నా

రిలీజ్ డేట్ల వాయిదాల గురించి నాగార్జున కొన్ని నెలలుగా సందర్భం దొరికినప్పుడంతా తన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. లెనిన్ నుంచి ఇట్లు అర్జున దాకా ఈ ప్రస్తావన వచ్చినప్పుడంతా పోస్ట్ పోన్ల పర్వం మంచిది కాదని, ఒక తేదీ ఫిక్స్ చేసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలని, ఫస్ట్ కాపీ కనీసం రెండు వారాల ముందే అందుబాటులో ఉండేలా దర్శకులు చేయగలిగితే నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని ప్రాక్టికల్ గా మాట్లాడారు. ఆయన అన్న ఒక్కో మాట ముమ్మాటికీ అక్షర సత్యం.

అయితే వాస్తవికంగా అది ఎంత ఆచరణ సాధ్యం కావడం లేదో నిన్న మరోసారి ఋజువయ్యింది. కింగ్ 100లో కీలక పాత్ర పోషిస్తున్న టబు టీజర్ దసరా పండగ సందర్భంగా విడుదల చేస్తామని అన్నపూర్ణ సంస్థ సోషల్ మీడియాలో ముందే ప్రకటించింది. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే లాంటి హిట్ కాంబినేషన్ కుదిరాక దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరూ ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు అభిమానులు అంచనాలు పెట్టుకోవడం సహజం.

తీరా చూస్తే కింగ్ 100 టబు టీజర్ సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయడం లేదంటూ నిన్న చావు కబురు చల్లగా ప్రకటించారు. అంటే ఒక చిన్న వీడియోని సమయానికి సిద్ధం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు రెండున్నర గంటల సినిమాకు లెక్కలేనన్ని ప్రతిబంధకాలు రావడంలో ఆశ్చర్యం లేదు కదా. ఇలా టీజర్లు సైతం వాయిదా పడటం కొత్తేమి కాదు. ప్యాన్ ఇండియా మూవీస్ ఇలాంటివి లెక్కలేనన్నిసార్లు అభిమానులతో ఎదురు చూపులు చేయించి విసిగించాయి.

అసలు నాగార్జున స్వంత సంస్థకే ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఇక బయటివాళ్ళ గురించి వేరే చెప్పాలా. అయినా ఇది సమిష్టిగా అందరూ పరిష్కారం వెతకాల్సిన సమస్య. చెప్పిన టైంకి కంటెంట్ ఇవ్వలేదని సిచువేషన్ వస్తుందని తెలిసినప్పుడు అనౌన్స్ మెంట్ ఇవ్వకపోవడమే బెటర్. ఈ విషయంలో అనిల్ రావిపూడిని మెచ్చుకోవాలి. క్లాప్ కొట్టినా, ఊటీ షెడ్యూల్ వేసినా, పాటల రికార్డింగ్ చేసినా, అన్నీ టైం ప్రకారం అప్డేట్స్ ఇస్తూ పబ్లిసిటీకి లోటు లేకుండా చూసుకోవడం ఒక కళ.