ఒక చిన్న సినిమా. కేవలం రెండున్నర కోట్ల బడ్జెట్ లో తీశారు. షూటింగ్ చివరి దశలో డబ్బులు అయిపోతే దర్శకుడు మనోజ్ కుమార్ తన తల్లి తాళిబొట్టుని తాకట్టు పెట్టేందుకు సిద్ధపడిన పరిస్థితి. రీ షూట్స్ అవసరం పడకపోవడంతో ఆ గండం తప్పింది కానీ లేదంటే అన్నంత పని చేయాల్సి వచ్చేది. స్టార్స్ ఎవరూ లేరు. రీమేక్ కాదు కదా డబ్బింగ్ హక్కులు కూడా తొలుత ఎవరూ అడగలేదు. తక్కువ అంచనాలతో విడుదలైన కన్నడ మూవీ ప్రేమద ఊరల్లీ మొదటి రెండు రోజులు సోసోగానే ఆడింది.
తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. మౌత్ టాక్ దావానలం అయ్యింది. థియేటర్లు కిటకిటలడాయి. ఎక్కడో మూలనున్న బిసి సెంటర్ల డబ్బా హాళ్లు కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. టికెట్ల కోసం గంటల తరబడి క్యూలు కనిపించాయి. కట్ చేస్తే ఇరవై ఏడు రోజులు పూర్తి చేసుకున్న ప్రేమ ఊరల్లీ చాలా ఈజీగా వంద కోట్లు దాటేసి ఇంకా స్ట్రాంగ్ గా కొనసాగుతోంది. దీంతో పాటే సెప్టెంబర్ 25 రిలీజైన ప్యారడైజ్ రేపు ఓటిటిలో వస్తుండగా శాండల్ వుడ్ బొమ్మ మాత్రం థియేటర్స్ నుంచి వెళ్లనంటోంది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రేమద ఊరెల్లిని తెలుగులో డబ్బింగ్ చేసి గాంధీ జయంతికి అక్టోబర్ 2 ప్రేమనే ఊరిలోగా రిలీజ్ చేస్తే మన ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ గతంలో చాలాసార్లు చూసినట్టు అనిపించడంతో వాళ్లకేం స్పెషల్ అనిపించలేదు. నేటివిటీ ఫాక్టర్ కూడా నెగటివ్ గా పని చేసింది. దీంతో వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రమోషన్లు అంతంత మాత్రంగా చేయడంతో ప్రేక్షకులు లైట్ తీసుకుని ఫ్లాప్ చేశారు.
కంటెంట్ బలమేంటో ప్రేమద ఊరల్లీ మరోసారి ఋజువు చేసింది. ఈ రోజుకి గంటకు 8 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం మాములు రికార్డు కాదు. ఇది ఎక్కడ ఆగుతోందో బయ్యర్ వర్గాలకు అంతు చిక్కడం లేదు. దీని దెబ్బకే శివరాజ్ కుమార్ మల్టీస్టారర్ ‘బెయిల్’ డిజాస్టర్ అయ్యిందని శివన్న ఫ్యాన్స్ ఫీలవ్వడం అబద్దం కాదు. బృంద విహారి అనే మరో పెద్ద సినిమా ఏకంగా నెల వాయిదా వేసుకుని నవంబర్ కు వెళ్ళిపోయింది. అంతే జనం నెత్తినబెట్టుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates