ప్రతిసారీ పోలికంటే ఎలా తమన్?

పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని చేస్తాడు. కానీ తన పాటలు, బీజీఎం విషయంలో తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పరిస్థితి. అతడి నుంచి ఏదైనా పాట వచ్చిందంటే చాలు.. దాని మూలం ఎక్కడుందా అని వెతకడం మొదలుపెడతారు సోషల్ మీడియా జనాలు. తమన్ నుంచి ఏదైనా ఒరిజినల్ సాంగ్ వచ్చింది అంటే ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి వస్తోంది.

ప్రస్తుతం తమన్ ‘ఆదర్శ కుటుంబం’ లాంటి క్రేజీ ప్రాజెక్టుకు పని చేస్తున్నాడు. ముందు ఈ చిత్రానికి ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నప్పటికీ తనతో సింక్ కుదరక ఎప్పట్లాగే తమన్‌కు బాధ్యతలు అప్పగించాడు త్రివిక్రమ్. ఐతే ఈ సినిమా నుంచి విడుదలవుతున్న పాటలు అంచనాలకు ఏమాత్రం తగ్గట్లు లేవు. ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ పాటను లాంచ్ చేసిన కాసేపటికే అది ‘నవనీతమ్మ’ అనే పాతకాలం పాటకు కాపీ అని పట్టేశారు నెటిజన్లు.

ఐతే జనం గుర్తు పట్టేశాక తాపీగా వచ్చి, ఈ పాటకు సాంగ్ ‘నవనీతమ్మ’నే, అందులో దాచేదేముంది అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు నిర్మాత నాగవంశీ. ఈ సంగతేదో ముందే చెబితే వ్యవహారం వేరుగా ఉండేది. ఇక ‘ఆదర్శ కుటుంబం’ నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్‌కి కూడా కొన్ని గంటల్లోనే కాపీ మరకలు అంటేశాయి. విశేషం ఏంటంటే.. ఈసారి కాపీ అంటున్నది తమన్ పాటకే.

సాయిధరమ్ తేజ్ మూవీ ‘ప్రతి రోజూ పండగే’లో ‘ఓ బావా..’ అంటూ సాగే పాట ట్యూన్‌నే తమన్ మళ్లీ రిపీట్ చేశాడంటున్నారు సోషల్ మీడియా జనాలు. రెండు పాటలను మార్చి మార్చి వింటే చాలా దగ్గరగా ఉన్న మాట వాస్తవం. ఇంతకుముందు కూడా తమన్ పాటల విషయంలో ఇలాంటి పోలికలు కనిపించాయి.

దీని గురించి అడిగితే.. ప్రతి సంగీత దర్శకుడికీ ఒక స్టైల్ ఉంటుందని, కొన్ని పాటల విషయంలో ఆ స్టైల్ రిపీట్ కావచ్చని వివరణ ఇచ్చాడు తమన్. మరి ఇప్పుడు కూడా అదే మాట చెప్పి కవర్ చేస్తాడేమో చూడాలి. ఐతే ఈ పాటలను ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్నది పక్కన పెడితే.. ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఇప్పటిదాకా వచ్చిన మ్యూజికల్ కంటెంట్ అయితే అంచనాలకు తగ్గట్లు లేదన్నది వాస్తవం.