ఇండస్ట్రీ హిట్… ఎవ్వరికీ ఇవ్వవా రజినీ?

ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో ఇండస్ట్రీ హిట్ అంటే ఒక్క రజినీకాంత్‌కే సొంతం అన్నట్లు తయారైంది. రికార్డు పెడితే సూపర్ స్టారే పెట్టాలి. దాన్ని బద్దలు కొట్టినా ఆయనే కొట్టాలి అన్నట్లు తయారైంది. 80, 90 దశకాల్లో కూడా రజినీ ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. కానీ వాటిని వేరే హీరోలు బద్దలుకొట్టారు.

కానీ ‘ఇండియన్’ సినిమా రికార్డులను ‘పడయప్పా’ (నరసింహా)తో అధిగమించాక.. రజినీని అందుకునే హీరోనే లేకపోయారు. అంతకుముందు వరకు కమల్..రజినీకి దీటుగా నిలిచేవాడు. కానీ క్రమంగా ఆయన జోరు తగ్గిపోయింది. మరోవైపు విజయ్, అజిత్ పెద్ద రేంజికి ఎదిగారు. సూర్య కూడా టాప్ లీగ్‌లోకి వచ్చాడు. కానీ వీళ్లందరిదీ ఒక లీగ్ అయితే.. రజినీ ఒక్కడిది వేరే లీగ్ అన్నట్లు తయారైంది.

తెలుగులో, మలయాళంలో, కన్నడలో కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకుని, కొంత మేర ఉత్తరాదిన కూడా పాగా వేసిన రజినీ.. ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. విదేశాల్లో కూడా ఆయన మార్కెట్ తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఇంకేముంది ఇండస్ట్రీ హిట్ కొట్టేది ఆయనే.. బద్దలు కొట్టేది ఆయనే అన్నట్లు తయారైంది పరిస్థితి. పడయప్పా తర్వాత చంద్రముఖి (2005), శివాజీ (2007), రోబో (2010), కబాలి (2016), 2.0 (2018).. ఇలా ఇండస్ట్రీ హిట్లు కొడుతూ పోయారు సూపర్ స్టార్.

మధ్యలో విజయ్.. వరుస బ్లాక్ బస్టర్లతో రజినీని మించి ఎదుగుతున్నట్లు కనిపించాడు. దర్బార్, పేట, అన్నాత్తే లాంటి ఫెయిల్యూర్లతో రజినీ బాగా డౌన్ అయ్యాడు. దీంతో ఆయన పనైపోయిందనుకున్నారంతా. కానీ 2023లో ‘జైలర్’తో మళ్లీ తనే కొత్త ఇండస్ట్రీ హిట్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు ‘జైలర్-2’తో మళ్లీ తన రికార్డును తానే బద్దలు కొట్టబోతున్నాడు. అన్నీ కలిసొస్తే ఈ చిత్రం తమిళంలో తొలి వెయ్యి కోట్ల సినిమా అయినా ఆశ్చర్యం లేదు. ఆ ఘనత మొదటగా సాధించిన హీరోగా కూడా రజినీనే నిలవబోతున్నారన్నమాట.