తొమ్మిది రోజుల ముందే రామాయణం మెగా ప్రిమియర్

ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్ పార్ట్ దీపావళి కానుకగా నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందు రోజు రాత్రే దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రిమియర్స్ వేయాలనుకుంటోంది చిత్ర బృందం. ఐతే అంతకంటే ముందు.. విడుదలకు 9 రోజుల ముందు యుఎస్‌లో ఈ సినిమాకు స్పెషల్ ప్రిమియర్ పడబోతోంది.

అక్టోబర్ 27న హాలీవుడ్ రాజధాని లాస్ ఏంజెల్స్‌లోని ప్రఖ్యాత అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో ఈ సినిమా గ్రాండ్ వరల్డ్ ప్రిమియర్‌కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఓ ఇండియన్ మూవీకి ప్రిమియర్ పడడం అన్నది అరుదైన ఘనతే. ‘రామాయణం’ను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్న సోనీ పిక్చర్స్ సంస్థ.. ఇక్కడ ప్రిమియర్ వేసేందుకు సన్నాహాలు చేసింది.

ఈ ప్రిమియర్‌ను అత్యాధునిక 3D ఫార్మాట్‌లో ప్రదర్శించనున్నారు. 945 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో హాలీవుడ్ ప్రముఖులు, గ్లోబల్ డైరెక్టర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, ప్రముఖ టెక్నీషియన్ల సమక్షంలో ఈ స్క్రీనింగ్ జరగనుందట. ఈ ప్రిమియర్ రెడ్ కార్పెట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రముఖులను కూడా సంప్రదాయ భారతీయ పండుగ దుస్తులు ధరించి రావాలని ఆహ్వానించారు. ఈ ప్రిమియర్‌తో ‘రామాయణం’ సినిమాకు వరల్డ్ వైడ్ మంచి ప్రమోషన్ లభిస్తుందని భావిస్తున్నారు.

నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘రామాయణం’ను నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు ఉమ్మడిగా నిర్మించాయి. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్. రెహమాన్, లెజెండరీ హాలీవుడ్ కంపోజర్ హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.