ఎవ‌రీ లారెన్స్ బిష్ణోయ్‌?

బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘ‌ట‌న ఇప్పుడు దేశ్యాప్తంగా సంచ‌లనం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబ‌యిలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడి ఇంటికి వ‌స్తున్న టైగ‌ర్ మీద ఇద్ద‌రు దుండ‌గులు చాలా ద‌గ్గ‌ర్నుంచి కాల్పులు జ‌ర‌ప‌గా.. అత‌ను త్రుటిలో ప్రాణాపాయం త‌ప్పించుకున్నాడు. ఈ దాడి చేసింది తామేన‌ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌టించుకుంది. దీంతో ఎవ‌రీ లారెన్స్ బిష్ణోయ్ అని మ‌రోసారి అంద‌రూ త‌న గురించి చ‌ర్చించుకోవ‌డం మొద‌లుపెట్టారు.

కొన్నేళ్ల ముందు పంజాబ్‌కు చెందిన ప్ర‌ముఖ గాయ‌కుడు సిద్ధు మూసేవాలా హ‌త్య వెనుక ఉన్న‌ది.. అలాగే బాలీవుడ్ సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తామ‌ని బెదిరించింది లారెన్స్ బిష్ణోయే. ప్ర‌స్తుతం అత‌ను తీహార్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. అయినా స‌రే.. 700 మందితో కూడిన గ్యాంగ్‌ను కెన‌డాలోని త‌న నెట్‌వ‌ర్క్ ద్వారా మేనేజ్ చేస్తూ బాలీవుడ్‌కు వ‌ణుకు పుట్టిస్తూ దేశంలో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య తీసుకువ‌స్తున్నాడు లారెన్స్. ఇంత‌కీ అత‌డి నేప‌థ్య‌మేంట‌న్న‌ది ఒక‌సారి చూద్దాం.

1993లో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఒక ధనిక కుటుంబంలో లారెన్స్ బిష్ణోయ్ పుట్టాడు. అతడి తండ్రి మాజీ పోలీస్ కానిస్టేబుల్. చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీలో చ‌దువుకుంటున్న స‌మ‌యంలో లారెన్స్ అడుగులు నేర ప్ర‌పంచం వైపు ప‌డ్డాయి. అక్కడ అతనికి గోల్డీ బ్రార్ ప‌రిచయం అయ్యాడు. అత‌డికి ఆల్రెడీ నేర ప్ర‌పంచంతో క‌నెక్ష‌న్స్ ఉన్నాయి. లారెన్స్‌ను కూడా అటు వైపు మ‌ళ్లించాడు. ఇద్ద‌రూ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ఏర్పాటు చేసి చిన్న చిన్న నేరాలకు పాల్పడటం మొదలుపెట్టారు.

2011లో తన కాలేజీలో ‘స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ’కి బిష్ణోయ్ అధ్యక్షుడిగా నామినేట్ అయ్యాడు. దీంతో త‌న హ‌వా పెరిగి రాజ‌కీయాలు, నేరాల్లో మ‌రింత యాక్టివ్ అయ్యాడు. తర్వాత పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్య‌క్షుడిగా పోటీ చేసి ఓడిపోవ‌డంతో గెలిచిన వ్య‌క్తి మీద దాడికి పాల్ప‌డ్డాడు. దీంతో తొలిసారిగా హ‌త్యాయ‌త్నం కేసులో జైలుపాల‌య్యాడు లారెన్స్. కొన్నేళ్ల‌ తర్వాత అత‌ను బ‌య‌టికి వ‌చ్చాడు. ఐతే జైలు నుంచే నేర సామ్రాజ్యంతో క‌నెక్ష‌న్స్ పెంచుకుని అక్క‌డి నుంచే త‌న గ్యాంగ్ ద్వారా వ్య‌వ‌హారాలు న‌డ‌ప‌డం అల‌వాటు చేసుకున్నాడు.

ఒక కేసుకు సంబంధించి 2015 జనవరిలో హైకోర్టులో విచారణకు తీసుకెళ్తుండగా బిష్ణోయ్‌ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ టైంలోనే నేపాల్‌కు పారిపోయి పెద్ద ఎత్తున ఆయుధాలు సేక‌రించాడు. 2015 మార్చిలో పోలీసులు అతడిని మ‌ళ్లీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు. కానీ జైలు నుంచే మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ హత్యలు చేయిస్తూ.. వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతూ తన గ్యాంగ్‌ను నడిపిస్తూ వ‌స్తున్నాడు. అనేక కేసుల వ‌ల్ల అత‌ను బ‌య‌టికి రావ‌ట్లేదు. 2018లో ల్మాన్ ఖాన్‌ను బహిరంగంగా బెదిరించడం ద్వారా బిష్ణోయ్ పాపులారిటీసంపాదించాడు.

అత‌డిని జోధ్‌పూర్ జైలుకు తీసుకెళ్తున్న సమయంలో తాము ఆరాధించే కృష్ణ జింక‌ల‌ను చంపినందుకు సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని అత‌ను మీడియా ముందే ప్రకటించాడు. త‌ర్వాత ఒక న్యూస్ ఛానెల్ ఇంట‌ర్వ్యూలోనూ ఇదే వ్యాఖ్య‌ల‌ను పున‌రావృతం చేశాడు. 2022లో పంజాబ్ సింగ‌ర్ సిద్ధు మూసేవాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హ‌త్య చేయ‌డంతో అత‌ను ఎంత‌టి ప్ర‌మాద‌కారో అంద‌రికీ తెలిసింది. ఈ హత్య జ‌రిగిన‌పుడే కాదు.. ప్ర‌స్తుతం టైగ‌ర్ ష్రాఫ్ మీద దాడి స‌మ‌యంలోనూ లారెన్స్ జైల్లోనే ఉన్నాడు.

కానీ అత‌డి గ్యాంగ్‌లో 700 మంది ప‌ని చేస్తున్నార‌ని.. కెన‌డా నుంచి లారెన్స్ త‌ర‌ఫున‌ గోల్డీ బ్రార్ ఈ గ్యాంగ్‌ను ఆప‌రేట్ చేస్తాడ‌ని అంటున్నారు. కెన‌డా ప్ర‌భుత్వం లారెన్స్ గ్యాంగ్‌ణు ఉగ్ర‌వాద సంస్థ‌గా కూడా ప్ర‌క‌టించింది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాద సంస్థ‌ల‌తో నెట్‌వ‌ర్క్ ఏర్పాటు చేసుకున్న ఈ గ్యాంగ్ ఆట క‌ట్టించ‌డం అంత తేలిక‌గా క‌నిపించ‌డం లేదు. భార‌త్, కెన‌డా ప్ర‌భుత్వాలు ఉమ్మ‌డిగా ప‌ని చేస్తే త‌ప్ప వీరికి అడ్డుక‌ట్ట వేయ‌డం క‌ష్ట‌మే. మ‌రి టైగ‌ర్ మీద దాడి నేప‌థ్యంలో ప‌రిస్థితి తీవ్ర‌త అర్థ‌మై భార‌త‌ ప్ర‌భుత్వం లారెన్స్ గ్యాంగ్ మీద ఉక్కుపాదం మోపుతుందేమో చూడాలి.