నెత్తుటి సముద్రంలో ‘కల్ట్’ విధ్వంసం

ఎవరూ బ్రేక్ ఇవ్వకపోతే మనకు మనమే ఇచ్చుకోవాలనే సూత్రం పాటిస్తున్నాడు హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్. హ్యాట్రిక్ డిజాస్టర్లు క్యూ కట్టి పలకరించడంతో మరోసారి డైరెక్టర్ చైర్ లో కూచుని కల్ట్ తీశాడు. అక్టోబర్ 30 విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్ ఇవాళ హైదరాబాద్ లో లాంచ్ చేశారు. కథను దాచడం లాంటివి చేయలేదు. ఇది అన్ని వయసుల వాళ్లకు కాదని, జెన్ జీ యువతని టార్గెట్ గా చేసుకుని తీశానని ముందే ఏ సర్టిఫికెట్ హింట్ ఇచ్చేస్తున్న విశ్వక్ అసలేం చెప్పాడో చూద్దాం.

గోవాలో అదో ఖరీదైన రిసార్ట్. ఒక పెద్ద బంగాళాలో ప్రమాదరకమైన ఆటలు కల్ట్ పేరుతో ఆడిస్తూ ఉంటారు. ఓడితే ప్రాణాలు పోతాయి తప్పించి వేరే ఆప్షన్ ఉండదు. అలాంటి డేంజర్ జోన్ లోకి అడుగు పెడతారు యువతీ యువకులు. అత్యంత కిరాతకంగా ఒక్కొక్కరు హత్యకు గురవుతూ ఉంటే మిగిలిన వాళ్ళు భయంతో బిక్కచచ్చిపోతారు. వాళ్ళ మధ్యలో డిసిపి సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) కూడా ఉంటాడు. బయట ప్రభుత్వం టెన్షన్ తో ఉన్న టైంలో ఈ మిషన్ తన చేతుల్లోకి తీసుకుంటాడు.

వెబ్ సిరీస్ లో మాత్రమే చూసే భీభత్సమైన వయొలెన్స్ తో కల్ట్ కంటెంట్ ఆమ్మో అనిపించేలా ఉంది. ఎవరిని లక్ష్యంగా పెట్టుకుని తీశారో ముందే చెప్పేశారు కాబట్టి కంప్లయింట్ చేయడానికి ఏం లేదు. కాకపోతే ఇంత హింసని థియేటర్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది స్క్రీన్ ప్లే మీద ఆధారపడి ఉంటుంది. దీనికి తరుణ్ భాస్కర్ సంభాషణలు రాయడం విశేషం. కెజిఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. విజువల్స్ ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి.

ఒకపక్క ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30 వస్తుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కల్ట్ మాత్రం నా పని నాదే తరహాలో డేట్ లాక్ చేసుకుని ప్రమోషన్లు ఉదృతం చేయబోతోంది. చాలా తక్కువ గ్యాప్ లో వరస సినిమాలతో పలకరించబోతున్న విశ్వక్ సేన్ ఇప్పుడీ కల్ట్ తో కనక హిట్టు కొడితే స్పెషల్ మెమరీ అవుతుంది. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీతో ఆల్రెడీ తన టాలెంట్ చూపించుకున్న విశ్వక్ ఈసారి సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడేమో చూడాలి. అది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరంగా.