తన బుర్రకథ, పాటలతో 80, 90 దశకాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక ఊపు ఊపేసిన కళాకారిణి గరివిడి లక్ష్మి. ఆ టైంలో గొప్ప వైభవం చూసిన ఆమె.. ఆ తర్వాత కొందరి మోసాల వల్ల, బుర్రకథకు ఆదరణ తగ్గిపోవడం వల్ల లైమ్ లైట్కు దూరం అయ్యారు. ఇప్పుడు మరుగున పడ్డ ఆమె కథను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెర మీదికి తీసుకొచ్చింది. గౌర్నాయుడు జమ్ము రూపొందించిన ‘గరివిడి లక్ష్మి’ దసరా కానుకగా విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే తెచ్చుకుంటోంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఈ సినిమ బాగా ఆడుతోంది. ఆనంది గరివిడి లక్ష్మి పాత్రను పోషించిన ఈ సినిమాలో.. చివర్లో రియల్ గరివిడి లక్ష్మిని కూడా చూపించడం విశేషం. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్కు కూడా ఆమె వచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ.. దర్శకుడు గౌర్నాయుడు తన కులం కావడం వల్లే అతడికి తన కథ చెప్పానని అమాయకంగా ఒక కామెంట్ చేయడం విశేషం. ఆమె ఇంకా ఏమన్నారంటే..
‘‘నా కథ కోసం గౌర్నాయుడు చాలాసార్లు మా ఊరొచ్చాడు. మా ఊరికొస్తే దేవుడి గుడికొచ్చినట్లు మా ఇంటికొస్తే కానీ తిరిగెళ్లేవాడు కాదు. అలా మూణ్నాలుగు నెలలు తిరిగాడు. అతణ్ని చూస్తే పాపం అనిపించింది. నా కథ కోసం ఇలా తిరుగుతున్నాడేంటి.. చూద్దాంలే అనుకున్నా. ఇద్దరిదీ ఒకే కాస్ట్ కదా. ఒకవేళ అవుతుందేమో చూద్దాం అనుకున్నా. తర్వాత పిలిచి నా కొద్దిగా నా కథ చెప్పాను. పూర్తిగా చెప్పలేదు. మిగతా కథ తర్వాత చెబుతా అని పంపించేశాను. కానీ పది రోజులకే మళ్లీ వచ్చేశాడు.
నన్ను కలవడానికి వస్తే వాళ్ల ఇంటికి కూడా వెళ్లేవాడు కాదు. వాళ్లమ్మ ఫోన్ చేస్తే తర్వాత వస్తా అని చిరాకు పడేవాడు. అలా నా కథ అంతా సేకరించి సినిమా తీశాడు. నేను మూణ్నాలుగు జిల్లాల వరకే ఫేమస్. ఇప్పుడు ప్రపంచానికి నా కథ తెలిసేలా చేశాడు. అది నాకు చాలా సంతోషం. నా కథ మీద సినిమా తీయాలని కృతి మేడమ్ (టి.జి.విశ్వప్రసాద్ తనయురాలు) పట్టుబట్టి చేశారు. అమెరికాలో పుట్టి పెరిగిన ఆమె.. ఇక్కడికొచ్చి నా సినిమా తీయాలనుకుంది. నా అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్లంతా సినిమా చూడాలి’’ అని గరివిడి లక్ష్మి పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates