సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హీరో అయిపోయాడు

ఈ రోజుల్లో సోషల్ మీడియాదే రాజ్యం. అక్కడ ఫాలోయింగ్ ఉన్న వాళ్లకు ఉండే డిమాండే వేరు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సినిమా వాళ్లకు దీటుగా ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఫాలోయింగ్‌తోనే చాలామంది సినిమాల్లోకి కూడా వచ్చేస్తున్నారు. చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకునేే మౌళి ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో ఎంత పేరు సంపాదించాడో తెలిసిందే. ఇటీవలే వెంకటేష్ మహా సినిమా ‘అట్టహాసం’లో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ స్రవంతి పెపకాయల కథానాయికగా అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ బాటలో ఇప్పుడు ‘ఏయ్ జూడ్’ పేరుతో పాపులర్ అయిన యూట్యూబర్ అజయ్ హీరో అవతారం ఎత్తేస్తున్నాడు. అతను ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బి.గోపాల్, హరీష్ శంకర్, బుచ్చిబాబు సానా లాంటి స్టార్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గొని అజయ్‌ని ఆశీర్వదించడం విశేషం.

అజయ్ హీరోగా రూపొందనున్న సినిమాకు రాము కొప్పుల దర్శకుడు. నెక్సస్ శ్రీధర్, దీపక్ ముత్యాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జానరేంటి.. ఇందులో అజయ్‌కి జోడీగా ఎవరు నటిస్తున్నారు అన్నది ఇంకా వెల్లడి కాలేదు. Ayejude పేరుతో అజయ్ నడిపే యూట్యూబ్ ఛానెల్‌కు 4.23 మిలియన్ సబ్‌స్క్రైబర్లు ఉండడం విశేషం. అజయ్‌కి మంచి బ్యాగ్రౌండే ఉంది. అతను మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ హనుమంతు తనయుడు.

అతను తండ్రి మీద ఆధారపడకుండా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని ఎదిగాడు. అతడి పెళ్ళికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరవడం విశేషం. అజయ్ తమ్ముడు ప్రణీత్ హనుమంతు కూడా ఫేమస్ యూట్యూబరే. ఐతే అతడి వీడియో ఒకటి తీవ్ర వివాదాస్పదం కావడంతో బాగా అన్‌పాపులర్ అయ్యాడు. ఇదీ అజయ్ నేపథ్యం. మరి నటుడిగా అతను ఎంతమేర ప్రతిభను చాటుకుంటాడు.. తన సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుంది అన్నది చూడాలి.