గట్టిగా నిలబడుతున్న గరివిడి లక్ష్మి

లెజెండరీ ఆర్టిస్టులు సావిత్రి, ఎన్టీఆర్ లాంటి వాళ్ళ బయోపిక్స్ స్టార్ ఆర్టిస్టులతో తెరకెక్కినప్పుడు సహజంగా ప్రేక్షకుల్లో వాటి మీద ఆసక్తి ఉంటుంది. కానీ తెరమీద కనిపించని గొప్ప కళాకారుల జీవితాలను చూపించాలనే ప్రయత్నం ఎప్పుడూ రిస్కే. అందులోలోనూ ఇమేజ్ అంతగా లేని ఆర్టిస్టులతో చేసినప్పుడు ఇది మరింతగా పెరుగుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ సాహసం చేసింది. గరివిడి లక్ష్మిని జైలర్ 2, రణబాలిలతో పాటు విడుదల చేయడం ఇండస్ట్రీ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఊహించని విధంగా ఉత్తరాంధ్ర వైపు గరివిడి లక్ష్మి బలంగా నిలబడుతోంది. ముఖ్యంగా వైజాగ్ ఏరియాతో పాటు గరివిడి చుట్టుపక్కల ప్రాంతాలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో భారీ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం గమనార్హం. 90 దశకంలో తన బుర్రకథలు, పాటలు, డాన్సులతో జనాన్ని ఉర్రూతలూగించిన లక్ష్మి కథని ఇంత సహజంగా దర్శకుడు గౌరీ నాయుడు తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ని మెప్పించినట్టు కనిపిస్తోంది.

దసరా, ప్యారడైజ్ ఎలా అయితే నైజాంలో డామినేషన్ చూపించాయో అచ్చం అదే తరహాలో గరివిడి లక్ష్మి తనకు పట్టున్న ఆంధ్ర ప్రాంతంలో దుమ్ము దులిపేస్తోంది. బుక్ మై షో ట్రెండింగ్ లో గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పది వేల దాకా టికెట్లు అమ్మడం ఇలాంటి చిన్న సినిమాకు పెద్ద విషయమే. సీడెడ్ వైపు కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ అక్కడ కూడా వీకెండ్ నుంచి పికప్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రేపటికి నెంబర్ల గురించి ఒక క్లారిటీ వస్తుంది.

ఆనందినికి మొదటిసారి తెలుగులో టైటిల్ రోల్ తో పాటు గర్వంగా పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి గరివిడి లక్ష్మిలో స్కోప్ దొరికింది. దాన్ని సంపూర్ణంగా వాడుకుంది కూడా. ఎమోషన్స్, ఆ గాయని జీవితంలో ఎదురైన ఆటుపోట్లు వగైరాలన్నీ చూపించడంలో గౌరీ నాయుడుకి మంచి మార్కులు పడుతున్నాయి. చరణ్ అర్జున్ సంగీతం హెల్ప్ అవుతోంది. నిజమైన గరివిడి లక్ష్మిని సరైన సమయంలో బయటికి తీసుకొచ్చి ప్రమోషన్లలో భాగం చేయడం ప్లస్ అవుతోంది. ఆవిడ గొప్పదనం కొత్త తరం ప్రేక్షకులు అర్థం చేసుకుంటున్నారు.