ప్రెగ్నెన్సీ హింసని కాస్త తగ్గించడయ్యా

హిట్టు ఫ్లాపుల ముచ్చట కాసేపు పక్కనపెడితే ఎమోషన్ పేరుతో కమర్షియల్ దర్శకులు ఒకే పంథాలో ఆలోచించడం ఆశ్చర్యం కన్నా ఎక్కువగా ఆందోళన కలిగిస్తోంది. ఈ మధ్య విడుదలైన మూడు సినిమాల్లో ఒకే తరహా ట్రీట్ మెంట్ కనిపించడం కాకతాళీయమే అయినా దాని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే గర్భిణీ స్త్రీల మీద నడిపిస్తున్న వయొలెన్స్. ప్యారడైజ్ ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే ఇలాంటి సీన్ పెట్టిన శ్రీకాంత్ ఓదెల హీరో ఇంట్రోకి అక్కడ పునాది వేశారు.

జైలర్ 2 లో వయొలెన్స్ మోతాదు పరిమితంగానే ఉన్నా, రజనీకాంత్ ఆచూకీ కోసం ఇద్దరు రౌడీలు ఒక నిండు గర్భిణీని కట్టేసి కర్రతో కాళ్ళ మీద కొట్టడం హీరోని రెచ్చగొట్టడానికే అయినా, దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. పైగా ఆమె మొహం మీద విలన్ల రక్తం చిందించడం దర్శకుడు నెల్సన్ పీక్ ఎలివేషన్ అనుకుని ఉండొచ్చు. రణబాలి ప్రీ క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య పెట్టిన ఇంటెన్స్ సీన్ లోనూ గర్భంపై హింస మీదే నడిపించారు రాహుల్ సంకృత్యాన్.

ఎలా చూసినా ఈ ట్రెండ్ సమర్ధనీయం కాదు. అలాని ఇదేదో కొత్తగా మొదలుపెట్టింది కాదు నిజమే. పెదరాయుడు, జయం మనదేరా లాంటి పాత సినిమాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి. కానీ వాటిని ఒక మోతాదు వరకే పరిమితం చేశారు ఆయా డైరెక్టర్లు. కానీ ఈ మధ్య కాలంలో సెన్సార్ ఎలాగూ అనుమతులు ఇవ్వడమో లేదా బ్లర్ చేయడమో చేస్తోంది కనక దర్శకులు తమ క్రియేటివిటీని ఇలాంటి హింస మీద చూపిస్తున్నారు. థియేటర్ లో ఇలాంటివి ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగిస్తాయి.

ఇంత లోతుగా పాత్రలను టార్చర్ పెడితేనే జనాలు కనెక్ట్ అవుతారనుకోవడం కరెక్ట్ కాదు. ఆ మాటకొస్తే అనిల్ రావిపూడి ఎంత మాస్ సినిమాలు తీసినా ఓవర్ బోర్డు వెళ్లరుగా. మరి బ్లాక్ బస్టర్స్ ఎలా పడుతున్నాయి. జెన్ జీని అర్థం చేసుకునే విధానం ఇది కాదు. వెబ్ సిరీస్, సినిమాలు రెండు వేర్వేరు. భావోద్వేగాలు పండించే తీరు కూడా ఒకేలా ఉండదు. క్యారెక్టర్ల మీద సానుభూతి కోసం మహిళల మీద వయొలెన్స్ ని ఆయుధంగా వాడుకుంటే అది రివర్స్ బూమరాంగ్ అయ్యే రిస్కు ఖచ్చితంగా ఉంది.