తెలుగు సినిమాలకు వచ్చేటప్పటికి దుల్కర్ సల్మాన్ అభిరుచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి క్లాసిక్స్ అనిపించుకునే చిత్రాలు చేయడం తన అదృష్టమో లేక అలా కలిసి వస్తుందో తెలియదు కానీ, అలాంటి మరో ప్రయత్నం ఆకాశంలో ఒక తారతో చేయబోతున్నాడు. నవంబర్ 20 విడుదల కాబోతున్న ఈ ఎమోషనల్ బయోపిక్ ద్వారా సాత్విక హీరోయిన్ గా పరిచయమవుతోంది. కథేంటో ఇవాళ విడుదలైన టీజర్ లో చెప్పేశారు.
అనగనగా ఒక చిన్న ఊరు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే పేదమ్మాయి కల్పన (సాత్విక వీరవల్లి)కి జీవితంలో పెద్ద లక్ష్యం ఉంటుంది. అదే ఆకాశానికి వెళ్లి దేశం తరఫున అక్కడ జెండా పాతడం. దాన్ని నెరవేర్చుకునే క్రమంలో కుటుంబం, టీచర్ల నుంచే అవమానాలు ఎదురవుతాయి. ఆ సమయంలో ఒక మాములు యువకుడు కృష్ణ (దుల్కర్ సల్మాన్) ఆమెకు అండగా నిలబడతాడు. కల్పనా ఏవియేషన్ అకాడెమి వెళ్లేలా చేస్తాడు. తర్వాత రాకెట్ లాంచ్ లో ఆమె ఏమేం సాధించిందనేది స్టోరీ.
టాలీవుడ్ లో ఈ మధ్య ఆర్గానిక్ మూవీస్ తగ్గిపోయాయి. హీరోల ఎలివేషన్లు, ప్యాన్ ఇండియా పేరుతో తెరమీద రక్తం, క్రైమ్, థ్రిలర్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న ట్రెండ్ లో ఆకాశంలో ఒక తార లాంటివి ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇలాంటివి గతంలో ఆకాశం నీ హద్దురా, ఉస్తాద్ లాంటి వాటిలో చూసినప్పటికీ దర్శకుడు పవన్ సాధినేని అమ్మాయిలు ఎదగాలి అనే పాయింట్ తీసుకున్న విధానం ఆకట్టుకునేలా ఉంది. విజువల్స్ చూస్తే ఆ నమ్మకం మరింత పెరుగుతోంది.
దుల్కర్ సల్మాన్, సాత్విక మధ్య రెగ్యులర్ ప్రేమకథ కాకుండా గోల్ చేరుకునే ఇన్స్ పిరేషన్ స్టోరీగా మలచడం బాగుంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా గీత ఆర్ట్స్, స్వప్న సినిమా సంస్థలు సంయుక్తంగా దీన్ని నిర్మించడం విశేషం. నవంబర్ 20 ఆకాశంలో ఒక తార ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దుల్కర్ సల్మాన్ మరోసారి కాన్ఫిడెంట్ కంటెంట్ తో వస్తున్నట్టు అర్థమైపోతుంది. అంచనాలను ఏ మాత్రం అందుకున్నా యూత్, ఫ్యామిలీస్ మరోసారి తనకు హిట్టు ఇవ్వడం ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates