సెలవు తీసుకున్న సంగీత తరంగం ‘దేవా’

దక్షిణాది సంగీత ప్రియులు ఏ మాత్రం జీర్ణించుకోలేని విషాద వార్త ఇవాళ జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా ఈ రోజు గుండెపోటుతో కన్ను మూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఇళయరాజా ప్రభంజనం ఉదృతంగా ఉన్న సమయంలో పరిశ్రమకు వచ్చిన దేవా ఆ పోటీని తట్టుకుని, ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ సెన్సేషన్ వచ్చిన తర్వాత కూడా తన ప్రత్యేకతను చాటుకోవడం గొప్ప స్థాయికి తీసుకెళ్లింది. కేవలం తమిళంలోనే కాదు తెలుగులోనూ దేవా వేసిన ముద్ర చాలా బలమైంది.

1992 ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘శ్రీమాన్ బ్రహ్మచారి’తో దేవా తొలిసారి టాలీవుడ్ లో అడుగు పెట్టారు. అదే బ్యానర్ లో ‘జగన్నాథం అండ్ సన్స్’ చేశారు. రెండు యావరేజ్ హిట్స్ కావడంతో ఎక్కువ పేరు రాలేదు. తర్వాత చెన్నైకి పరిమితమై కోలీవుడ్ కు పూర్తిగా అంకితమైపోయారు. 1997 చిరంజీవి ‘మాస్టర్’ కోసం సురేష్ కృష్ణ మరోసారి దేవాని తీసుకొచ్చారు. సూపర్ హిట్ సాంగ్స్ తో మెగాస్టార్ కు మర్చిపోలేని ఆల్బమ్ ఇచ్చారు. ముఖ్యంగా చిరు పాడిన తమ్ముడు తమ్ముడు ఎవర్ గ్రీన్ సాంగ్.

1998 పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’లో అసలు ఆడగొంతు లేకుండా కేవలం మేల్ సింగర్స్ తో దేవా చేసిన ప్రయోగం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప పాటలు ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ‘నాగ’లో మూడు పాటలు దేవా కంపోజ్ చేసినవే. నాగార్జున ఆటో డ్రైవర్, నవీన్ వడ్డే బాగున్నారా, దాసరి అరుణ్ గ్రీకువీరుడు దేవా పనిచేసిన మరికొన్ని తెలుగు సినిమాలు. చివరిగా 2010 ‘కారా మజాకా’ తర్వాత ఫామ్ తగ్గిపోవడంతో మళ్ళీ ఆయనతో చేయించుకున్న తెలుగు దర్శక నిర్మాతలు లేరు.

రజనీకాంత్ ‘బాషా’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవా పనితనానికి ఒక సాక్ష్యం. ‘అన్నామలై’లో రజనికి ఇచ్చిన బీజీఎమ్ ఇప్పటికీ టైటిల్ కార్డులో వాడుతూ ఉంటరు. ఇంతకన్నా గర్వకారణం ఏముంటుంది. 400 పైగా సినిమాలకు దేవా ఎంతో గొప్ప సంగీతాన్ని సమకూర్చారు. ఇన్ని ఘనతలు ఉన్నా ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారాలు రాలేదని అభిమానులు లోటుగా భావిస్తారు. భౌతికంగా సెలవు తీసుకున్నా దేవా ఇచ్చిన మరపురాని పాటలు ఆయన్ని సంగీత ప్రియుల హృదయాల్లో శాశ్వత జీవిగా నిలుపుతాయి.