తన కొడుకు అఖిల్ సినిమా లెనిన్ రిలీజ్ డేట్ మళ్లీ మళ్లీ మార్చాల్సి రావడం.. చివరి నిమిషంలో హడావుడి గురించి ఆ సినిమా సక్సెస్ మీట్లో అక్కినేని నాగార్జున ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అన్నమయ్య లాంటి సినిమాకు విడుదలకు నెల రోజుల ముందే ఫస్ట్ కాపీ తీసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. దర్శకులు సరైన ప్లానింగ్తో షూటింగ్ చేసి, వీలైనంత ముందుగా పోస్ట్ ప్రొడక్షన్ టీంకు సినిమాను అప్పగించాలని ఆయన ఓ విలువైన సూచన చేశారు.
మరి అందరికీ చెప్పి, తాను ఆ సలహాను పాటించకపోతే కష్టం కదా. అందుకే తన వందో సినిమా కింగ్ 100 విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నట్లు నాగ్ చెప్పారు. తాను ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్న ఇట్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో నాగ్.. రిలీజ్ డేట్స్ ప్రకటించడం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి ఓ సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశామంటే దానికి కట్టుబడి పని చేయాలని.. అలా కాని పక్షంలో డేట్ అనౌన్స్ చేయకూడదని నాగ్ అభిప్రాయపడ్డారు.
డిసెంబరు 24కు తన వందో సినిమాను రిలీజ్ చేస్తానని చెప్పా కాబట్టి ఆ డేట్ను అందుకునేందుకు రేయింబవళ్ళు పని చేస్తున్నామని.. చెప్పిన డేటుకే సినిమాను తీసుకువస్తామని నాగ్ స్పష్టం చేశారు. లెనిన్ సినిమాతో పాటు ఆదర్శ కుటుంబం మూవీ విషయంలోనూ నిర్మాత నాగవంశీ ఇష్టానుసారం డేట్లు మార్చడం మీద తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో నాగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇట్లు అర్జునను అక్టోబరు 2న రిలీజ్ చేయాలనుకోగా.. ఆ డేటుకి ఆదర్శ కుటుంబం వచ్చి పడింది. దీంతో ఈ మూవీని 30కి మార్చుకున్నారు.
కానీ ఆదర్శ కుటుంబం అక్టోబరు 2న రాలేదు. ఇప్పుడేమో అక్టోబరు 30న రావచ్చంటున్నారు కానీ.. దాని మీదా క్లారిటీ లేదు. ఆదర్శ కుటుంబం 30న వచ్చేట్లయితే ఇట్లు అర్జున డేట్ను మరోసారి మార్చుకోవాల్సి వస్తుంది. పెద్ద సినిమాల షూటింగ్, రిలీజ్ ప్లానింగ్ సరిగా లేకపోతే.. చిన్న సినిమాలు ఇబ్బంది పడతాయంటూ నాగ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం చూస్తే ఆదర్శ కుటుంబం టీంను పరోక్షంగా తప్పుబట్టినట్లే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates