పేరుకు మలయాళ అమ్మాయే కానీ.. అనుపమ పరమేశ్వరన్ కెరీర్లో ఎక్కువగా తెలుగు సినిమాలే చేసింది. ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. తెలుగమ్మాయిలా కలిసిపోయింది. తాజాగా క్రేజీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుపమ.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్ చేసింది. తనకు పెళ్లికి ముందే బిడ్డ కావాలంటూ ఆమె వ్యాఖ్యానించింది.
పెళ్లికి ముందే పిల్ల కావాలి.. బిడ్డను కనాలి అంటూ ఆమె ఒక ప్రమోషనల్ ప్రెస్ మీట్లో చేసిన కామెంట్‌కు విలేకరులు ఒకింత ఆశ్చర్యపోయి, అదెలా అని అడిగారు. అందుకామె బదులిస్తూ.. ఎలా ఏముంది నార్మల్‌గా బిడ్డను కనొచ్చు. ఐవీఎఫ్ ద్వారా కనొచ్చు. దత్తత కూడా తీసుకోవచ్చు అని పేర్కొంది. తనకు పెళ్లవుతుందో లేదో కానీ.. అంతకంటే ముందు ఏదో ఒక రకంగా ఒక బిడ్డకు తల్లి కావడం మాత్రం ఖాయమన్నట్లు అనుపమ మాట్లాడింది.
అనుపమ కొన్ని నెలల ముందు వరకు ఒక సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉంది. తమిళ హీరోతో ఆమె ప్రేమలో పడిందనే పుకారు జోరుగా చక్కర్లు కొట్టింది. కానీ తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ మధ్య పేరెత్తకుండా.. తానొక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు చెబుతూ, తీవ్ర వ్యాఖ్యలే చేసింది అనుపమ. ఆ బంధంలో ఉండగా తాను నరకయాతన అనుభవించానని, తన ఆరోగ్యం కూడా దెబ్బతిందని, ఇప్పుడే మామూలు మనిషిని అయ్యానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక అనుపమ ఫిలిం కెరీర్ విషయానికి వస్తే ఆమెకు ఓ మంచి హిట్ పడి చాలా కాలమైంది. బైసన్ తర్వాత ఏ సినిమా ఆడలేదు. తెలుగులో గత ఏడాది చేసిన పరదా నిరాశపరిచింది. తమిళంలో నటించిన లాక్ డౌన్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు దసరా కానుకగా రిలీజైన తెలుగు మూవీ క్రేజీ కళ్యాణం యావరేజ్ టాక్ తెచ్చుకుంటోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates