జైలర్ 2 కత్తిరింపుల మీద అనుమానాలు

నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది స్టార్ హీరోల క్యామియోల నిడివిని బాగా తగ్గించడం. మోహన్ లాల్ మేకప్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో ద్వారా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మలయాళ సూపర్ స్టార్ కి ఇలాంటి గౌరవం ఇస్తారా, కనీసం ట్రైలర్ లో ఉన్న సీన్ మెయిన్ మూవీలో లేకపోవడం బాధ కలిగించిందని, తన హీరోకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదని నిర్మొహమాటంగా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

అధికారికంగా బయటికి రాలేదు కానీ చెన్నై వర్గాల ప్రకారం ఈ కత్తిరింపులు కేవలం లాలెట్టన్ కే పరిమితం కాలేదు. రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ లో పసుపు చొక్కా ధోవతి కాస్ట్యూమ్ తో ఒక ఎపిసోడ్, విజయ్ సేతుపతి రజనీ మధ్య తమలపాకుల సన్నివేశం, ఆ తర్వాత ఇంట్లో జరిగే ఒక కీలక ఇన్వెస్టిగేషన్, శివ కార్తికేయన్ తో చిన్న క్లిప్, శివ రాజ్ కుమార్ చివర్లో చేసే ఫైట్ లో ఒకడిని నరికి చంపడాన్ని సైడ్ యాంగిల్ నుంచి హడావిడిగా చూపించడం లాంటివి ఎన్నో ఎడిటింగ్ రూమ్ లో ఎగిరిపోయాయని సమాచారం.

ఒకవేళ ఇవన్నీ పెట్టి ఉంటే లెన్త్ పెరిగేదేమో కానీ అవసరం లేని భాగాలు తీసి వీటిని జోడించి ఉంటే బాగుండేదేమోననే అభిప్రాయం మూవీ లవర్స్ లో వ్యక్తమవుతోంది. హృతిక్ రోషన్ పాత్ర ఫుల్ మీల్స్ అనుకుంటే ప్లేట్ మీల్స్ తో సరిపెట్టారని, పాతిక కోట్లు తీసుకున్న మనిషిని ఇంకా బాగా వాడాల్సిందని కోలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. ఆల్రెడీ కట్ చేసిన వెర్షనే మూడు గంటలకు దగ్గరగా ఉంటే ఇక ఈ ఫుటేజ్ అంతా కలిపితే యానిమల్, పుష్ప అంత అయిపోతుంది.

వీటి సంగతి ఎలా ఉన్నా జైలర్ 2 వసూళ్లు మాత్రం బాగున్నాయి. తమిళనాడులోనే కాదు ఏపీ తెలంగాణలోనూ మంచి ఆక్యుపెన్సీలు పడుతున్నాయి. రణబాలి పోటీ ఉన్నప్పటికీ మాస్ జనాలు రజనికి ఓటేస్తున్న దాఖలాలు బిసి సెంటర్స్ లో కనిపిస్తున్నాయి. టాక్స్, రివ్యూస్ పరంగా రెండు ఇంచుమించు ఒకే రైలులో ప్రయాణం చేస్తున్నట్టే ఉంది. ఎవరిది పై చేయి అవుతుందనేది సోమవారానికి క్లారిటీ వస్తుంది. వీకెండ్ దాకా ఎలాంటి ఢోకా లేకుండా రజని, విజయ్ నిలబడతారు.