రామాయణ లెక్కలు ఇప్పుడు సరిపోయాయా

నిన్న బెంగళూరులో రామాయణ పార్ట్ 1 కొత్త ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్ చేశారు. రావణుడిగా నటించిన యష్ మెయిన్ హైలైట్ గా నిలవగా సాయిపల్లవితో పాటు ప్రధాన తారాగణం, సాంకేతిక వర్గం హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. విడుదలకు కేవలం 19 రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ కోసం టీమ్ పరుగులు పెడుతోంది. గతంలో వచ్చిన టీజర్, సీతారాముల పాట, ట్రైలర్ ఆశించినంత భారీ స్థాయిలో పాజిటివ్ అనిపించుకోకపోవడంతో టీమ్ మరో వెర్షన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది.

ఈసారి విజువల్స్ లో చాలా మెరుగుదల కనిపించింది. విఎఫ్ఎక్స్ లో ప్రధానమైన మార్పులు చేసినట్టు ఉన్నారు. అయితే కర్ణాటకలో చేసిన ఈవెంట్ కాబట్టి యష్ ని ఎక్కువ హైలైట్ చేసి వీడియో కట్ చేశారు. రావణుడి నేపథ్యంతో పాటు అతను పెట్టుకున్న సంకల్పం, ముల్లోకాల మీద ఆధిపత్యం చెలాయించాలని చూడటం, ఇవన్నీ కొత్త కాదు కానీ యష్ ని ఆ విధంగా మలచుకోవడంలో దర్శకుడు నితేశ్ తివారి సక్సెసయ్యారని చెప్పాలి. అలాని రామాయణ లెక్కలన్నీ సరిపోయినట్టు కాదు.

నవంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న రామాయణ సుమారు నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఇప్పుడు వచ్చేది పార్ట్ 1. సీక్వెల్ ఇంకో ఏడాదిన్నర అంటే 2028లో జరుగుతుంది. దీనికి బిజినెస్ బాగా జరగాలన్నా, పార్ట్ 2 కోసం బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎగబడాలన్నా ఇప్పుడీ రామాయణ ఎక్స్ ట్రాడినరిగా పెర్ఫార్మ్ చేయడం చాలా ముఖ్యంగా. ఓవర్సీస్ నుంచి ఒరిస్సా దాకా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించాల్సిన బాధ్యత ఉంటుంది.

గ్రాఫిక్స్ పరంగా మెరుగుదల ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ ఆశించామని పెదవి విరుస్తున్న మూవీ లవర్స్ లేకపోలేదు. కొన్ని సీన్స్ లో ఆర్టిఫీషియల్ సెటప్ అనిపించిందని, రాక్షసుడిని రాముడు చంపే సీన్ లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందని కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్యాన్ ఇండియా సినిమాలకు శల్యపరీక్షలు అందులోనూ నెగటివ్ ఎక్కువ రావడం సహజమే కానీ అంచనాలను అందుకుని ఊహకందని థియేటర్ బిజినెస్ చేయాల్సిన మహత్తర బాధ్యత నితేశ్ మీద ఉంది.