థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్… ఓటీటీలో సూప‌ర్ హిట్?

కొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో బాగా ఆడ‌తాయి. ఓటీటీలోకి వ‌చ్చాక విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూ ఉంటాయి. మ‌రి కొన్ని సినిమాలేమో థియేట‌ర్ల‌లో బాగా ఆడ‌వు. కానీ డిజిట‌ల్‌గా రిలీజైన‌పుడు మంచి స్పంద‌నే తెచ్చుకుంటాయి. థియేట‌ర్ల‌లో ఇర‌గాడేసిన ఇరుముడి సినిమాను ఓటీటీలో చాలామంది విమ‌ర్శించ‌డం తెలిసిందే. ఐతే గ‌త నెల ప‌దో తారీఖున థియేట‌ర్ల‌లో రిలీజై వీకెండ్లోనే వాషౌట్ అయిపోయి డిజాస్ట‌ర్‌గా నిలిచిన స‌ర్దార్-2 సినిమాకు మాత్రం ఇప్పుడు ఓటీటీలో మంచి స్పంద‌నే వ‌స్తోంది. థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు వారాల‌కే ఈ సినిమాను డిజిటల్‌గా రిలీజ్ చేశారు.

అమేజాన్ ప్రైమ్ సంస్థ మూడు రోజుల కింద‌ట‌ ఈ సినిమాను స్ట్రీమ్ చేయ‌డం మొద‌లుపెట్టింది. అప్ప‌ట్నుంచి దీనికి మంచి స్పంద‌న వ‌స్తోంది.
నేరుగా ఇండియా ట్రెండింగ్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానానికి వెళ్లిపోయిన స‌ర్దార్-2.. స్ట‌డీగా అదే స్థానంలో కొన‌సాగుతోంది. ట్రెండ్ అవుతున్న తీరు చూస్తుంటే జ‌నం ఈ సినిమాను ఎగ‌బ‌డి చూస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

స‌ర్దార్-2 గురించి థియేట్రిక‌ల్ రిలీజ్ టైంలో విప‌రీత‌మైన నెగెటివ్ పోస్టులు క‌నిపించాయి సోష‌ల్ మీడియాలో. కానీ ఇప్పుడు దానికి భిన్న‌మైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సినిమాలో లోపాలున్నప్ప‌టికీ.. కాన్సెప్ట్ మంచిదే అని, కొన్ని ఎపిసోడ్లు బాగున్నాయ‌ని, ఫ‌స్టాఫ్ బాగానే వ‌ర్క‌వుట్ అయింద‌నే కామెంట్లు పెడుతున్నారు చూసిన వాళ్లు.

సెకండాఫ్ కొంచెం జాగ్ర‌త్త ప‌డి ఉంటే సినిమా బాగానే ఆడేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీనియ‌ర్ క్యారెక్ట‌ర్లో కార్తి మేక‌ప్.. ఎస్.జె.సూర్య లౌడ్ యాక్టింగ్ మీద మాత్రం నెగెటివ్ కామెంట్లే ప‌డుతున్నాయి. ద‌ర్శ‌కుడు పి.ఎస్.మిత్ర‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని.. కానీ ఎగ్జిక్యూష‌న్ కొంచెం జాగ్ర‌త్త‌గా చేసి ఉంటే బాగుండేద‌ని అంటున్నారు.

ప్రైమ్‌లో ఇంకొన్ని రోజులు ఇలాగే స‌ర్దార్-2 ట్రెండ్ అయితే.. ఓటీటీలో దీన్ని సూప‌ర్ హిట్‌గా ప‌రిగ‌ణించొచ్చేమో. ఈ చిత్రాన్ని ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో తీయగా.. థియేట్రికల్ రన్ నుంచి అందులో నాలుగో వంతు కూడా వెనక్కి రాలేదు. సర్దార్ 3 కూడా తీయాలని విడుదలకు ముందు అనుకున్న కార్తి, మిత్రన్ రిజల్ట్ చూశాక ఆ ఆలోచనను మానుకునే ఉంటారేమో.