గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం ఫ్లాప్ అయినా సరే మిగిలినవి జనాన్ని లాగేయాలి. కానీ గాంధీ జయంతి నుంచి నిన్న సోమవారం దాకా జరిగిన బాక్సాఫీస్ పరిణామాలు ట్రేడ్ ని నిరాశకు గురి చేశాయి. రాజమౌళి ముందుండి ప్రమోషన్లు చేయించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా పెద్ద ట్రబుల్ కొని తెచ్చుకుంది. దెబ్బకు టీమ్ సైలెంట్ అయిపోయి పోస్ట్ ప్రమోషన్లు ఆపేసింది.

తమిళనాడు సిఎం కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న స్టాంప్ తో పాటు సందీప్ కిషన్ ఇమేజ్ ‘సిగ్మా’కు ఎంతో కొంత మేలు చేసింది. కానీ టాక్ నిరాశాజనకంగా ఉండటంతో వసూళ్లు ఏ మాత్రం పికప్ అయ్యే సూచనలు లేవు. ఆదివారమే చాలా చోట్ల షోలు వేయాలా వద్దానేంత అతి తక్కువ ఆక్యుపెన్సీలు కనిపించాయని ట్రేడ్ టాక్. ఇక ‘తెల్లకాగితం’ ఉన్నంతలో కొంత సౌండ్ చేసింది కానీ కంటెంట్ మీద యునానిమస్ టాక్ రాకపోవడం వల్ల అద్భుతాలు చేసే అవకాశం లేనట్టే.

ఆది సాయికుమార్ ‘ఎస్ఐ యుగంధర్’ వచ్చిన సంగతే చాలా మందికి తెలియదు. ఎంత నెగటివ్ ఉన్నా కనీసం రివ్యూలకు కూడా నోచుకోలేకపోయిందంటే పబ్లిసిటీ ఎంత వీక్ గా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ‘అనకాపల్లి’ ఏదో హడావిడి చేసింది కానీ పనవ్వలేదు. అక్కడ ఇక్కడ కలెక్షన్లు బాగున్నాయని టీమ్ చెప్పడం తప్పించి గ్రౌండ్ లో పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇక తమిళ డబ్బింగ్ ‘డోరతీ’తో కన్నడ అనువాదం ‘ప్రేమనే ఊరిలో’ సంగతి సరేసరి. వీటిని మనోళ్లు పిచ్చ లైట్ తీసుకున్నారు.

ఉన్నంతలో మన భాష కాని సినిమాలు దృశ్యం 3, డోరేమాన్ మల్టీప్లెక్సుల ఫీడింగ్ కి బాగా పనికొచ్చాయి. వారాంతం డామినేషన్ వీటిదే. పెద్దలు బాలీవుడ్ మూవీకి ఓటేస్తే పిల్లలు కార్టూన్ బొమ్మకి జై కొట్టారు. ఎటొచ్చి ఎదురీత చూసింది మన టాలీవుడ్ చిత్రాలే. ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటంతో ఇప్పుడు అందరి కళ్ళు కామ్రేడ్ కళ్యాణ్ మీదకు వెళ్లిపోయాయి. కంటెంట్ ఓ మోస్తరుగా కనెక్ట్ అయినా చాలు శ్రీవిష్ణుకి సూపర్ హిట్ ఇచ్చేందుకు ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు.