ఒకప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియన్ ఫిలిం మేకర్స్ ఆలోచించడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆస్కార్ మరీ అందనంత దూరంలో ఏమీ లేదని.. గట్టిగా ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదని మన వాళ్లకు అర్థమైంది. మన సినిమా ప్రమాణాలు కూడా ఎంతో పెరిగిన నేపథ్యంలో ఆ అత్యున్నత అవార్డులు లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు ఫిలిం మేకర్స్.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాకా సినిమాకు ఆస్కార్ వస్తుందన్న ఆశలతోనే టీం పని చేస్తోందట. ఇటీవలే అత్యధిక కెమెరాలతో మోషన్ పిక్చర్ క్యాప్చర్ చేసి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది రాకా టీం. ఆ సెటప్ చూస్తే సినిమా రేంజే వేరని అర్థమవుతోంది. ఈ సినిమాతో ఆస్కార్ గెలవడానికి గట్టిగానే ప్రయత్నిస్తానని తన ప్రొడక్షన్లో వచ్చిన బత్తా సినిమా సక్సెస్ మీట్లో అట్లీ ధీమా వ్యక్తం చేశాడు.
ఆస్కార్ అవార్డు విషయంలో నాకో చిన్న కల ఉందని.. దాన్ని నిజం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని అట్లీ చెప్పాడు. అందరి మద్దతు ఉంటే,ఆ కలను నిజం చేయగలనన్న నమ్మకం తనకు ఉందని అట్లీ వ్యాఖ్యానించాడు. తనకు ఆస్కార్ వస్తే మాత్రం అకాడమీ వేదిక మీద తాను తమిళంలోనే మాట్లాడతానని అట్లీ స్పష్టం చేశాడు.
ఆస్కార్ అనేదీ అసాధ్యమైన విషయమేమీ కాదని.. మనం చేయగలమని తాను నమ్ముతున్నానని.. మనం ఆస్కార్ గెలవగలమని.. హాలీవుడ్ మనల్ని చూస్తుందని.. మనం అక్కడికి చేరుకోగలమని.. తనపై, తన టీమ్‌పై పూర్తి నమ్మకం ఉందని అట్లీ ధీమా వ్యక్తం చేశాడు.
ఒకవేళ రాకా మూవీతో అది జరగకపోతే… తర్వాతి సినిమాతో మరోసారి ప్రయత్నిస్తానని, ‘రాకా’ తమిళ ప్రజలు గర్వపడేంత గొప్పగా నిలవబోతోందని అట్లీ అన్నాడు. ఇక రాకా సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌తో కలిసి తాను ఒక హాలీవుడ్ స్టూడియోకు రికార్డింగ్ కోసం వెళ్తే.. ముందు తమను ఎవరూ పట్టించుకోలేదని, గౌరవించలేదని.. కానీ తమ మ్యూజిక్ బుక్ ఇచ్చి రికార్డింగ్ చేయమని అడిగాక, అభ్యంకర్ వర్క్ చూసి అక్కడి వాళ్లు షాకయ్యారని అట్లీ తెలిపాడు. అభ్యంకర్ గాడ్స్ చైల్డ్ అని, అతను ఎక్కడికో వెళ్తాడని, తమిళ ప్రజలు గర్వించేలా చేస్తాడని అట్లీ అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates