టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు లీక్ అయ్యాయంటూ రేపిన వివాదంలో నిజా నిజాలు ఎంత ఉన్నా పబ్లిసిటీకి ఆ టాపిక్ ఉపయోగపడింది. పైగా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ దక్కి, ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ బాగున్నాయంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఓపెనింగ్స్ కి ప్లస్ అయ్యింది. పలు చోట్ల రాజమౌళి ఫ్యామిలీ తీసిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కన్నా తెల్లకాగితం కలెక్షన్లే ఎక్కువున్నాయి.

అలాని ఇదేదో యునానిమస్ గా టాక్ వచ్చిన బాపతు కాదు. రెస్పాన్స్ మిక్స్డ్ గానే ఉంది. కమర్షియల్ లెక్కలు కాసేపు పక్కన పెడితే ఈ మధ్య ఒక ధోరణి టాలీవుడ్ లో కనిపిస్తోంది. అదే టీనేజ్ ప్రేమలను క్యాష్ చేసుకోవడం. పదో తరగతిలోనే లవ్వులో పడటం, కూతురిని విపరీతంగా ప్రేమించే స్ట్రిక్ట్ తండ్రి, హీరోయిన్ ని హెచ్చరించే స్నేహితురాలు, హీరోని చెడగొట్టడానికి సలహాలిచ్చే ఒక బేవార్స్ పాత్ర, జోకులు వేయడానికి హీరో పక్కన స్నేహితుడు, చివర్లో బరువైన ఎమోషన్ కూడిన క్లైమాక్స్.

తెల్లకాగితంతో పాటు ఆ మధ్య వచ్చిన హుషారు పిట్టలలోనూ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. కాకపోతే ముగింపులు వేరు. ఒకదానిలో ప్రేమిస్తే తరహా ఎమోషనల్ ట్విస్ట్ పెడితే మరో దాంట్లో కె బాలచందర్ టైపు ట్రాజెడీతో గుండెలు బరువెక్కించేందుకు ట్రై చేశారు. చాలా విషయాల్లో రెండింటి మధ్య సారూప్యత ఉంది. ప్రమోషన్స్ లో చూపించిన బోల్డ్ కంటెంట్ కొంత యూత్ ని టికెట్లు కొనేలా చేసిన మాట నిజం. మూడు నుంచి నాలుగు కోట్ల దాకా వసూళ్లు వచ్చే అవకాశమూ ఉంది.

తెలిసి తెలియని వయసులో ప్రేమించుకోవడం తొందపడటం తప్పని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ దానికి రెండు గంటల సేపు ప్రేమలో పడటం అంత ఈజీనా అనిపించేలా లవ్ ట్రాక్స్ చూపించడం మాత్రం ఆమోద్యయోగంగా అనిపించదు. చెడు తాలూకు పరిణామాలు చూపించాలంటే చెడుని చూపించాలనే లాజిక్ దర్శకులు మాట్లాడొచ్చు కానీ ఇలాంటివి నిజంగా యువతని మారుస్తాయా అంటే సమాధానం ఎస్ అని మాత్రం రాదు. కానీ యూత్ వల్ల ఎంతో కొంత డబ్బులైతే టికెట్ల రూపంలో వస్తాయి.