బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి తన చివరి సినిమా పెద్ద తలనొప్పిగా మారింది. 2020లో భారత్, చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన భీకర పోరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ముందు బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అని టైటిల్ పెట్టారు.
కానీ చైనా నుంచి అభ్యంతరాలు రావడం, కేంద్ర ప్రభుత్వం కూడా అడ్డు చెప్పడంతో ఈ టైటిల్ మార్చి మాతృభూమి అని పెట్టారు. అంతే కాక సినిమాలో చాలా సన్నివేశాలను కూడా మార్చాల్సిన పరిస్థితి తలెత్తింది. దాదాపు 40 శాతం రీషూట్లు కూడా చేశారు. కానీ ఎంత చేసినా సరే.. ఈ సినిమాకు క్లియరెన్స్ రాలేదు. విడుదలకు నోచుకోలేదు. చైనా లాంటి పవర్ ఫుల్ కంట్రీతో ఘర్షణకు దారి తీసే ప్రమాదం ఉన్న సినిమా కావడంతో సెన్సార్ చేయడానికి ముందే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సిన పరిస్థితి మాతృభూమి టీంకు వచ్చింది.
మినిస్ట్రీ సూచనల ప్రకారం మార్పులు చేర్పులు చేసి, రీషూట్లు అన్నీ పూర్తి చేసి సినిమాను రెడీ చేసిన మేకర్స్.. ఇటీవలే మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు మాతృభూమి ఫస్ట్ కాపీ చూపించారట. అక్కడి నుంచి నిరభ్యంతర పత్రం వచ్చినట్లు సమాచారం. త్వరలోనే సెన్సార్ బోర్డుకు సినిమాను పంపించబోతున్నారట. మినిస్ట్రీ నుంచి క్లియరెన్స్ వచ్చిందంటే సెన్సార్ బోర్డు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లే. అంతా అనుకున్నట్లే జరిగితే నవంబరు 13న మాతృభూమిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు.
కానీ ఈ సినిమా ఫలితం మీద చాలా సందేహాలున్నాయి. ఈ సినిమా తీసిన దర్శకుడు అపూర్వ లఖియా ట్రాక్ రికార్డు పేలవం. రామ్ చరణ్‌తో ‘జంజీర్’ లాంటి కళాఖండం తీసిన దర్శకుడు అపూర్వ. ఆ తర్వాత కూడా అతడి నుంచి గొప్ప సినిమాలేవీ రాలేదు. సినిమా చాలా ఆలస్యం కావడం.. కథలో మార్పులు చేర్పులు.. రీషూట్ల తాలూకు నెగెటివిటీని అధిగమించి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates