మురారి చూసే వారాహి తీశా

సీనియ‌ర్ న‌టుడు సుమంత్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన కొత్త సినిమా మ‌హేంద్రగిరి వారాహి మీద విడుద‌ల‌కు ముందు మంచి అంచ‌నాలే ఉన్నాయి. కానీ ఆ అంచ‌నాల‌ను క‌నీస స్థాయిలో కూడా అందుకోలేక‌పోయిందా సినిమా. ఇంత‌కుముందు సుమంత్‌తో సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం తీసిన సంతోష్ జాగ‌ర్ల‌పూడినే ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాల క‌థ‌లు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటాయి.

దీనికి తోడు మ‌హేంద్ర‌గిరి వారాహికి మురారి మూవీతోనూ పోలిక ఉంటుంది. దేవుడి శాపం వ‌ల్ల‌ ఒక వంశానికి చెందిన‌ మ‌గ‌వాళ్లు ఒక వ‌య‌సు రాగానే చ‌నిపోవ‌డం అనే కాన్సెప్ట్ మురారిలో చూసిందే. ఆల్రెడీ చూసిన పాయింటే అయినా.. దాన్ని స‌రిగ్గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే సినిమా క్లిక్ అయ్యేదేమో. కానీ అలా జ‌ర‌క్క‌పోవ‌డంతో మ‌హేంద్ర‌గిరి వారాహి ప్రేక్షకుల తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది.

ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌లో సినిమా చూసిన వాళ్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఒక నెటిజ‌న్.. మురారి సినిమా చూసుకోవ‌చ్చు క‌దా అంటూ డైరెక్ట‌ర్‌ను తిడుతూ పోస్టు పెట్టాడు. దానికి సంతోష్ జాగ‌ర్ల‌పూడి స్పందించ‌డం విశేషం. మురారి చూసే తీశానంటూ అత‌ను రిప్లై ఇచ్చాడు. దీని మీద నెటిజ‌న్లు మ‌ళ్లీ కౌంట‌ర్లు వేస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్‌తో మ‌ళ్లీ సినిమా ఎలా తీశావు అంటూ అత‌డిని విమ‌ర్శిస్తున్నారు.

మ‌హేంద్ర‌గిరి వారాహిలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కూడా ఒక క్యామియో చేశాడు. కానీ అది తేలిపోయింది. సుమంత్ పాత్ర కూడా అంతంత‌మాత్రంగానే ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ మ‌రీ పేల‌వం. క‌మెడియ‌న్లు బ్ర‌హ్మానందం, వెన్నెల కిషోర్‌ల‌ను ఇమేజ్‌కు భిన్న‌మైన పాత్ర‌ల్లో చూపించారు కానీ.. అది అస్స‌లు వ‌ర్క‌వుట్ కాలేదు. ట్విస్టులు తేలిపోవ‌డంతో సినిమా చివ‌రికి తీవ్ర అసంతృప్తిని క‌లిగిస్తుంది. ఈ చిత్రాన్ని మ‌ధు కాలెపు నిర్మించాడు.