పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్ హిట్ కావడం మాములు ఉత్సాహాన్ని ఇవ్వలేదు. ఓటిటిలో ఆ స్థాయి రెస్పాన్స్ రాలేదు కానీ ఇప్పటి ట్రెండ్ లో హీరోల మార్కెట్ శాశించేది కలెక్షన్లే కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే తన విజయాన్ని తక్కువంచనా వేయడానికి లేదు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో మొదటిసారి డైరెక్షన్ చేస్తున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంటుంది. దీనికి ‘రియాలిటీ’ అనే టైటిల్ దాదాపు ఫిక్స్ అయ్యింది.

అసలు ట్విస్ట్ ఏంటంటే రియాలిటీని డిసెంబర్ 24 విడుదల చేసే ఆలోచన జరుగుతోందట. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు డేట్ కూడా వచ్చే వారం రివీల్ చేస్తారని టాక్. అయితే అదే సమయంలో నాగార్జున కింగ్ 100, బాలకృష్ణ దాదా ఆల్రెడీ అఫీషియల్ గా కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఒకేసారి ఇద్దరు సీనియర్లతో తలపడటం అంటే మాటలు కాదు. రిస్క్ అవుతుంది. పైగా అదే రోజు షారుఖ్ ఖాన్ కింగ్ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇది కూడా కాంపిటీషన్ లో ఉన్నదే.

ఇక్కడితో అయిపోలేదు. రెండు హాలీవుడ్ క్రేజీ మూవీస్ అవెంజర్స్ డూమ్స్ డే, డ్యూన్ 3 క్రిస్మస్ కు వారం ముందే రాబోతున్నాయి. ఇన్నేసి సినిమాల మధ్య రియాలిటీ నిలవాలంటే స్ట్రాంగ్ కంటెంట్ పడాలి. కిరణ్ అబ్బవరం అయితే ఆ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడని టాక్. చెఫ్ గా ఇందులో విభిన్నమైన పాత్ర చేస్తూ ఎంటర్ టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ రెండూ ఉండేలా చూసుకున్నాడట. అందుకే ఇంత నమ్మకంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడో ఇంకో క్యాలికులేషన్ చూడాలి.

దాదా ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలన్స్ షూటింగ్ కి ఏర్పాట్లు జరిగాయి కానీ ఎంత భాగం ఉంది. బాలయ్య ఆరోగ్యం ఏ మేరకు వేగానికి సహకరిస్తుందనేది సెట్స్ లో అడుగు పెట్టాక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే సంక్రాంతి లేదా అటుపై వెళ్లొచ్చు. కింగ్ 100కి ఎలాంటి సమస్య లేదు కానీ టాలీవుడ్ స్టార్ హీరోల రిలీజులు మాట మీద ఉంటాయన్న గ్యారెంటీ ఈ మధ్య తగ్గుతోంది. గతంలో పోటీలోనే క లాంటి సక్సెస్ కొట్టిన కిరణ్ అబ్బవరం రియాలిటీతో ఏం చేస్తాడో.