లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద పడేలా చేసుకోవడం చిన్న సినిమాలకు అంత తేలిక కాదు. అందుకోసమే ‘తెల్లకాగితం’ చిత్ర బృందం ప్రమోషన్లు కొంచెం గట్టిగా చేసింది. ఐతే టీం ఎంత ప్రమోషన్లు చేసినా రాని పబ్లిసిటీ.. ఈ సినిమా నుంచి ఆన్ లైన్లో లీక్ అయిన ఒక సీన్ వల్ల వచ్చింది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే ఇంటిమేట్ సీన్ అది.

మొత్తంగా సినిమానే లీక్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో చిత్ర బృందం మీద సానుభూతి వ్యక్తం చేస్తూ అనేక పోస్టులు కూడా పడ్డాయి. ఐతే ఈ లీక్ నిజంగా జరిగిందా.. లేక పబ్లిసిటీ కోసం, యువతను థియేటర్లకు రప్పించడానికి టీం కావాలనే ఆ ఒక్క సీన్ లీక్ చేసిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే ప్రశ్నను ‘తెల్లకాగితం’ ప్రెస్ మీట్లో దర్శకుడు రమేష్ బండ్రెడ్డిని అడిగితే.. అతను సమాధానం ఇచ్చాడు.

అసలు ఆ సన్నివేశం ఎలా లీక్ అయిందో తమకు తెలియదని రమేష్ సమాధానం చెప్పాడు. పబ్లిసిటీ కోసం తాము ఆ సీన్ లీక్ చేశామనే ప్రచారాన్ని అతను ఖండించాడు. ఇప్పుడు అందరూ సినిమా చూశారు కదా, ‘తెల్లకాగితం’ ఆ టైపు సినిమానా అని అతను ప్రశ్నించాడు. తమ సినిమాకు సెన్సార్ బోర్డు యు-ఎ సర్టిఫికెట్ ఇచ్చిందని, కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడొచ్చని చెప్పిందని, వల్గారిటీ ఉంటే ఆ సర్టిఫికెట్ వచ్చేదా అని అతను ప్రశ్నించాడు. ఈ సీన్ లీక్ అయినట్లు తెలిసినపుడు.. తమ సినిమా మీద ప్రేక్షకులకు వేరే అభిప్రాయం కలుగుతుందేమో అని తాను బాధ పడ్డానన్నాడు.

సోషల్ మీడియాలో చాలామంది తన మీద, తన హీరో మీద బ్యాడ్ కామెంట్లు చేశారని.. ఎంతో కష్టపడి సినిమాను ఇంత వరకు తీసుకొస్తే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారేంటనే ఆవేదన కలిగిందని చెప్పాడు. తాను మంచి మెసేజ్‌తో, చాలా క్లీన్‌గా సినిమా తీశానని.. అలాంటి సినిమా తీసి మళ్లీ వేరే అభిప్రాయం కలిగేలా ఆ సీన్ ఎందుకు లీక్ చేస్తామని అతనన్నాడు. లీక్ అయిన సన్నివేశాలన్నింటినీ తమ టీం సోషల్ మీడియా నుంచి తొలగించిందని, ఇప్పుడు ఏ ఇబ్బందీ లేదని అతను స్పష్టం చేశాడు. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన ‘తెల్లకాగితం’ను కృష్ణ కొమ్మలపాటి నిర్మించాడు.