రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ హిస్టారికల్ డ్రామాని మైత్రి మూవీ మేకర్స్ ఖర్చుకు వెనుకాడకుండా తీశారు. ఇటీవలే కాన్సెప్ట్ వీడియోస్ విడుదల చేసిన టీమ్ కంటెంట్ ఎలా ఉంటుందో, బ్యాక్ డ్రాప్ దేని గురించో స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది కదా, ఇక అసలు విషయానికి వద్దాం.

ప్యారడైజ్ నిరాశపరిచాక టాలీవుడ్ బాక్సాఫీస్ ఒక సాలిడ్ మాస్ హిట్ కోసం ఎదురు చూస్తోంది. దీనికన్నా ముందు ఆదర్శ కుటుంబం ఏకే 47 ఉంది కానీ అది త్రివిక్రమ్ స్టయిల్ లో సాగే ఫన్ ప్లస్ యాక్షన్ ఎంటర్ టైనర్. కాబట్టి వందల కోట్లు కొల్లగొట్టే రేంజ్ లో మేజిక్ చేస్తుందా లేదానేది ఇప్పుడే చెప్పలేం. రణబాలికి ఆ సమస్య లేదు. స్వాతంత్రం రాకముందు నేపధ్యమే అయినా ఊర మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెడుతూనే చాలా ఇంటెన్స్ డ్రామాగా తీర్చిదిద్దారని టాక్.

ఒక రోజు ముందు వస్తున్న జైలర్ 2 గురించి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ పడుతున్న మాట వాస్తవమే కానీ జానర్ పరంగా చూసుకుంటే రెండింటికి సంబంధమే లేదు. పైగా సీక్వెల్స్ కి ఉండే క్రేజ్ ఈసారి ఎందుకో రజనీకాంత్ సినిమాకి ఎక్కువ కనిపించడం లేదు. ముఖ్యంగా అనిరుధ్ రవిచందర్ పాటల మీద ఆశించిన స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాకపోవడం బజ్ మీద ప్రభావం చూపించేలా ఉంది. సో రణబాలికి ఇది ఒకరకంగా అడ్వాంటేజని చెప్పొచ్చు.

వచ్చే వారం ట్రైలర్ చూశాక రణబాలి మీద ఎలాంటి అంచనాలు పెట్టుకోవచ్చో ఒక క్లారిటీ వస్తుంది. నవంబర్ లో రామాయణ వచ్చేదాకా బాక్సాఫీస్ వద్ద మరీ భారీ చిత్రాలేవీ లేని నేపథ్యంలో ఆ అవకాశాన్ని కనక రణబాలి వాడుకుంటే విజయ్ దేవరకొండకు సాలిడ్ కంబ్యాక్ అవుతుంది. అసలే సోషల్ మీడియా బ్యాచులు కొన్ని ఈ మూవీ మీద ప్రత్యేకంగా కన్నేసి ఉంచాయి. ఏ మాత్రం అటుఇటు అయినా అటాక్ చేయడానికి రెడీగా అంటాయి. వాళ్లకు దొరకనంత యునానిమస్ గా కంటెంట్ ఉండాలి.