రెండు రోజుల కిందటే స్టూడెంట్ నెం.1 సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంటే ఇండియాలోనే బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా ఎదిగిన రాజమౌళి.. దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 25 ఏళ్లు అయిందన్నమాట. ఈ సందర్భాన్ని తెలుగు సినిమా లవర్స్ బాగానే సెలబ్రేట్ చేశారు. సోషల్ మీడియాలో జక్కన్నకు ఎలివేషన్ మామూలుగా లేదు.
ఐతే అందరూ తన 25 ఏళ్ల ప్రస్థానం గురించి మాట్లాడుతుంటే.. రాజమౌళి మాత్రం యాంకరింగ్ లెజెండ్ సుమకు ఎలివేషన్ ఇచ్చాడు. సుమ కూడా ఫిలిం ఈవెంట్లకు యాంకరింగ్ మొదలుపెట్టింది స్టూడెంట్ నెం.1 సినిమాతోనేనట. ఈ విషయాన్ని గతంలోనే ఒక సందర్భంలో ఆమె పంచుకుంది. ఈ 25 ఏళ్లలో వేల సినిమా ఈవెంట్లలో ఆమె యాంకరింగ్ చేసింది. ఆమె వాక్చాతుర్యం, సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈ లెజెండరీ యాంకర్‌కు మంగళవారం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ప్రి రిలీజ్ ఈవెంట్లో సరైన గౌరవం దక్కింది. సుమ 25 ఏళ్ల ప్రస్థానం మీద టీం ఒక ఏవీ తయారు చేసింది. ఎప్పుడూ ఇలాంటి ఈవెంట్లలో వేరే వాళ్ల ఏవీలు ప్లే చేయమని సుమ చెప్పడం మామూలే. కానీ ఈ ఈవెంట్లో రాజమౌళి ఆ పని చేశారు. తాను చాలామంది హీరోల ఏవీలను ఆవిష్కరించానని.. కానీ ప్రి రిలీజ్ ఈవెంట్లలో అతి పెద్ద హీరో అయిన సుమ ఏవీని ప్లే చేయించే అవకాశం వచ్చింది అని చెప్పి ఏవీ వేయించారు జక్కన్న.
ఐతే కొన్ని సెకన్ల పాటు ఏవీ ప్లే కాకపోవడంతో సుమ తనదైన శైలిలో పంచ్ వేసింది. వారణాసి ఈవెంట్లో మాదిరే ఈ వీడియో కూడా ప్లే అవ్వట్లేదంది. ఇదంతా ప్లాన్ చేసింది కార్తికేయనేనా అని చమత్కరించింది. తర్వాత ప్లే అయిన వీడియోలో సుమ పంచ్‌లు, ఆమె మీద రాజమౌళి సహా పలువురు వేసిన పంచ్‌లు.. సుమ యాంకరింగ్‌లో చమక్కులు అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ వీడియో చూశాక తనకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదంటూ కొంత ఎమోషనల్ అయిన సుమ.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తలవంచి నమస్కరించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
