వామ్మో.. ఈ క‌థ‌ను విజ‌య్, అజిత్ ఇష్ట‌ప‌డ్డారా?

మొన్న రాత్రి నుంచి సౌత్ ఇండియన్ సినిమాకు సంబంధించి సోష‌ల్ మీడియాలో నాని మూవీ ది ప్యార‌డైజ్ ట్రెండ్ అవుతూ వ‌చ్చింది. పాజిటివ్ కావ‌చ్చు, నెగెటివ్ కావ‌చ్చు.. నిన్నంతా కూడా ఆ సినిమా చ‌ర్చ‌లే న‌డిచాయి. కానీ ఈ రోజు మాత్రం ఓ త‌మిళ సినిమా.. నాని మూవీకి పోటీగా వ‌చ్చింది. ఆ చిత్ర‌మే.. డొరోతీ. పిజ్జా, జిగ‌ర్ తండ చిత్రాల ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది. కీర్తి సురేష్, రిషికాంత్, సనంత్‌ ఇందులో ముఖ్య పాత్రలు చేశారు.

నిజానికి ఒకేసారి త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ ఎందుకో తెలుగు వెర్ష‌న్ ఇప్పుడు రిలీజ్ కాలేదు. త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే థియేట‌ర్ల‌లోకి దిగింది. ఈ సినిమాకు క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలే ఇచ్చినప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో మాత్రం డొరోతీని విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవ‌డానికి కూడా ఈ ట్రోలింగే కార‌ణం.

డొరోతీ ఒక బోల్డ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కింది. ఇందులో సనంత్ పాత్రను స్వ‌లింగ సంప‌ర్కుడిగా చూపించారు. అత‌ను త‌న ఫ్రెండే అయిన రిషికాంత్‌ను ప్రేమిస్తాడు. ముందు అత‌ణ్ని అస‌హ్యించుకున్న రిషికాంత్.. చివ‌రికి అత‌డి ప్రేమ‌ను అర్థం చేసుకుని ద‌గ్గ‌రికి తీసుకుంటాడు. అమ్మాయిగా మారిన స‌నంత్‌కు రిషికాంత్ లిప్ లాక్ ఇవ్వ‌డంతో ఈ సినిమా ముగుస్తుంది.

ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతే కాక‌.. ప‌దేళ్లు పోయాక మేమే నార్మ‌ల్. మిమ్మ‌ల్నే తేడాగా చూస్తారు అంటూ హిజ్రా పాత్ర చెప్పే డైలాగ్ చ‌ర్చనీయాంశం అవుతోంది. ఈ కాన్సెప్ట్ మీద సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదేం రోత అంటూ చాలామంది తిడుతున్నారు. అదే స‌మ‌యంలో కొంద‌రు ఈ బోల్డ్ అటెంప్ట్‌ను ప్ర‌శంసిస్తున్నారు.

ఐతే సినిమా మీద ఈ చ‌ర్చ ఇలా ఉంటే.. డొరోతీ స్టోరీ గురించి కార్తీక్ సుబ్బ‌రాజ్ మాట్లాడుతూ.. ఈ క‌థ‌ను తాను చాలా ఏళ్ల ముందే విజ‌య్, అజిత్‌ల‌కు చెప్పాన‌ని.. వాళ్లిద్ద‌రికీ క‌థ న‌చ్చింద‌ని.. డేట్ల స‌మ‌స్య వ‌ల్ల వారితో సినిమా చేయ‌లేక‌పోయార‌ని చెప్పిన‌ట్లుగా ఓ వార్త ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇదెంత వ‌ర‌కు నిజ‌మో కానీ, ఈ న్యూస్ అయితే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఈ క‌థ‌ను ఇద్ద‌రు టాప్ హీరోలు మెచ్చి, సినిమా చేయ‌డానికి రెడీ అయ్యారంటుంటే వారి అభిమానుల‌కు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. నిజంగా వాళ్లిద్ద‌రూ ఈ సినిమా చేసి ఉంటే.. ఆ చివ‌రి స‌న్నివేశం చూసిన ప్రేక్ష‌కుల ప‌రిస్థితి ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.