ఒక తెలుగు సినిమా పాతిక రోజులకు పైగా స్ట్రాంగ్ రన్ చూసి ఎంత కాలమయ్యిందంటే వెంటనే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే రాజమౌళి, సుకుమార్ లాంటి క్రేజీ డైరెక్టర్లు సైతం మూడు వారాలకు మించి థియేటర్ రన్ చూపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ జపాన్ లో గొప్పగా ఆడి ఉండొచ్చేమో కానీ ఇక్కడ యాభై రోజుల సెంటర్లు పట్టుమని పది కూడా లేవు. కానీ ఎక్కువ టికెట్ రేట్లున్నా జనం విపరీతంగా నెల రోజుల్లోపే చూసేయడంతో వందల కోట్లు వచ్చి పడుతున్నాయి.
ఇక్కడ ఇరుముడి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. కేవలం 28 రోజులకే ఓటిటి అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఇరుముడి రేపటి నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తుంది. హెచ్డి క్వాలిటీతో ఎన్నిసార్లు కావాలన్నా చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎక్కడో ఒక పల్లెటూరిలో ఊరి జనం వీధిలో తెరకట్టుకుని పైరసీ ప్రింట్ చూడటం సోషల్ మీడియా ఫొటోల్లో చిక్కింది. ఇప్పుడు ఒరిజినల్ వస్తే ఆగుతారా. ఎన్ని ఊళ్ళలో ఎన్ని షోలు ఇలా ఓపెన్ గా పడతాయో ఊహకందడం కష్టం.
ఈ విషయంలో మాత్రం ఇరుముడిని ఇతర నిర్మాతలు ఫాలో కాకపోతే బెటరని డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయపడుతున్నారు. ఏదైనా సినిమా ఫలితం ముందే గెస్ చేయడం దాదాపుగా జరగని పని. బ్లాక్ బస్టర్ అవుతుందన్నది డిజాస్టర్ కావొచ్చు. ఏం ఆడుతుందిలే అనుకున్నది చరిత్ర సృష్టించవచ్చు. ఇరుముడికి జరిగింది ఇదే. హిట్ అవుతుందనుకున్నారు కానీ ఇలా రికార్డులు పాతరేస్తుందని ఊహించి ఉంటే థియేటర్ బిజినెస్ లెక్కలు వేరుగా ఉండేవనేది వాస్తవం.
హిట్టు ఫ్లాపుల సంగతి పక్కనపెడితే ఈ ఇరవై ఎనిమిది రోజుల విండోని పొడిగించి కనీసం నలభై లేదా యాభై రోజులు చేయాలని బయ్యర్ల కోరిక. నిర్మాత కోణంలో చూస్తేనేమో పెట్టుబడిని రిస్క్ లో పెట్టలేక ముందస్తు అగ్రిమెంట్లకు ఒప్పుకుంటున్నారు. కానీ క్షేత్ర స్థాయి సిచువేషన్ చూస్తేనేమో ఇలా ఉంది. బాలీవుడ్, మల్లువుడ్ లో సాధ్యమయ్యింది మన దగ్గర ఎందుకు జరగదు అనేదే అసలు ప్రశ్న. కోలీవుడ్ లో కూడా ఈ సమస్య మీద పోరాడుతున్నారు కానీ పరిష్కారమే దొరకడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates