ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి, ఎలాంటి అద్భుతాలు చేయొచ్చో బాహుబలి 2, కెజిఎఫ్ 2, పుష్ప 2 లాంటివి ఋజువు చేశాయి. కానీ ప్రతిసారి ఈ మేజిక్ రిపీట్ కాదు. తాజాగా విడుదలైన కార్తీ ‘సర్దార్ 2’ మొదటి వీకెండ్, పండగ సెలవు ఉన్నా సరే పది కోట్ల గ్రాస్ టచ్ చేయడానికే కిందా మీదా పడేంత డిజాస్టర్ కావడం అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను కూడా షాక్ కు గురి చేసింది.
ఇది మొదటిసారి జరిగింది కాదు. మన్మథుడు లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్ కి 2 తగిలించి రాహుల్ రవీంద్రన్ ఏదో ట్రై చేస్తే అడ్డంగా బెడిసి కొట్టింది. గబ్బర్ సింగ్ క్రేజ్ క్యాష్ చేసుకుందామని సర్దార్ గబ్బర్ సింగ్ తో వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు జడుసుకునే రిజల్ట్ వచ్చింది. రవితేజ క్రేజీ మూవీస్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్న కిక్ ని అదే టీమ్ తో కొనసాగింపు చేస్తే ఊసులో లేకుండా పోయింది. ఇవే కాదు గతంలో మంత్ర 2, భారతీయుడు 2, సామీ స్క్వేర్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే ఉంది.
ఏదో హైప్ ఉంది కదాని బలవంతంగా కథలను సాగదీసినందుకు దక్కిన ఫలితాలు ఇవి. రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్ ఎందుకు ఫెయిల్ కాలేదంటే వాళ్ళ స్టోరీలో నిజాయితీ ఉంది, అయిదు గంటలకి పైగా చెప్పాల్సిన కంటెంట్ ఉంది కాబట్టి. అంతెందుకు దురంధర్ 2 కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఆదిత్య ధార్ ఏడు గంటలకు పైగా వెబ్ సిరీస్ లెన్త్ తో రెండు సినిమాలు తీసి బాలీవుడ్ లో వేల కోట్లతో కొత్త రికార్డులు సృష్టించడం ఇప్పట్లో ఎవరూ మర్చిపోయేది కాదు.
ఈ ప్రవాహం ఇకపై కూడా ఆగదు. వచ్చే నెల జైలర్ 2 వస్తోంది. ఇది బ్లాక్ బస్టర్ అయితే సీక్వెల్స్ మీద తగ్గిపోయిన నమ్మకం తిరిగి వస్తుంది. పవన్ కళ్యాణ్ ఓజి 2 కూడా ఇంతే స్థాయిలో అంచనాలు మోస్తోంది. కాకపోతే ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. శతమానం భవతికి కొనసాగింపు అనౌన్స్ చేసిన దిల్ రాజు ఆ తర్వాత ఎందుకో ఆగిపోయారు. దేవర 2 దాదాపు ఉండకపోవచ్చని ఇప్పటికే టాక్ ఉంది. అన్ని భాషల్లోనూ గత పదేళ్లలోనే ఈ పార్ట్ 2 ప్రహసనాలు బాగా ఎక్కువైపోయాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates