తమిళంలో రెండు దశాబ్దాల ముందే సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో విక్రమ్. సేతు, దిల్, ధూల్, జెమిని, పితామగన్, సామి, అపరిచితుడు.. ఇలా చాలా తక్కువ టైంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో అతను పెద్ద రేంజికి ఎదిగిపోయాడు. ముఖ్యంగా పితామగన్, సామి, అపరిచితుడు తన కెరీర్‌ను వేరే లెవెల్లో నిలబెట్టాయి. మొత్తంగా సౌత్ ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడిగా అవతరించాడు. ఈ ఊపులో ఇంకొన్ని హిట్లు పడి ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్‌కు దీటుగా నిలబడేవాడేమో.
కానీ ‘అపరిచితుడు’ తర్వాత గత రెండు దశాబ్దాల్లో ఆ రేంజ్ హిట్ ఒక్కటీ అందుకోలేకపోయాడు విక్రమ్. తన సినిమాల ప్రోమోలు చూస్తే చాలా ప్రామిసింగ్‌గా అనిపిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర అద్భుతం జరగబోతున్నట్లు అనిపిస్తుంది. తీరా సినిమాలు చూస్తే ఆ స్థాయిలో ఉండవు. కొన్ని సినిమాలు పూర్తిగా ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంటాయి. కొన్ని క్రిటికల్ అక్లైమ్ తెచ్చుకుంటాయి. కొన్ని ఓపెనింగ్స్ వరకు మెరుపులు మెరిపిస్తాయి. చివరికి మాత్రం విక్రమ్ సినిమాకు ఆశించిన ఫలితం దక్కదు. గత ఏడాది వచ్చిన వీర ధీర సూరన్, అంతకుముందు సంవత్సరం విడుదలైన తంగలాన్ కూడా ఇలాగే నిరాశపరిచాయి.
ఇప్పుడు విక్రమ్ నుంచి ‘పవర్ హౌస్’ అనే సినిమా రాబోతోంది. ఇంతకుముందు విక్రమ్‌తో ‘ఇరు ముగన్’ అనే సినిమా తీసిన ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ఫ్లాప్ అయింది. ఆనంద్ తర్వాత కూడా సరైన సినిమాలు అందించలేకపోయాడు.
ఇప్పుడు అతను కమ్ బ్యాక్ కోసం విక్రమ్‌తోనే జట్టు కట్టాడు. ఈ సినిమా టైటిల్ టీజర్ వినాయక చవితి సందర్భంగా రిలీజైంది. ఇందులో విక్రమ్.. ‘జెంటిల్‌మ్యాన్’లో అర్జున్ తరహా పాత్ర చేస్తుండడం విశేషం. ఒకవైపేమో ఫ్యామిలీ సపోర్ట్‌తో క్యాటరింగ్ బిజినెస్ నడుపుతుంటాడు. టీజర్లో ఫస్టాఫ్ అంతా ఈ నేపథ్యంలోనే సరదాగా సాగింది.
కానీ అక్కడ్నుంచి బయటపడి ఇంట్లో వెనుక వైపుకు వెళ్తే.. అక్కడ అతను కట్టి పడేసిన ఇద్దరు రక్తమోడుతూ కనిపిస్తారు. అందులో ఒక వ్యక్తి నుంచి కారిన రక్తాన్ని శుభ్రం చేస్తూ.. రెండో వ్యక్తికి వార్నింగ్ ఇస్తాడు విక్రమ్. హీరో పైగా మామూలుగా కనిపిస్తూ.. తెర వెనుక చాలా వయెలెంట్‌గా వ్యవహరించే కథలు కొత్తేమీ కాదు.
కానీ కాన్సెప్ట్ కొత్త కాకపోయినా.. టీజర్ చాలా ఎంటర్టైనింగ్‌గా సాగి సినిమా మీద అంచనాలు పెంచింది. ఎప్పట్లాగే విక్రమ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. ఐతే టీజర్లో ఉన్నంత కిక్కు సినిమాలోనూ ఉండి విక్రమ్‌కు ఓ మంచి విజయం దక్కితే చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates