చాలా గ్యాప్ తర్వాత విశ్వంభర మళ్ళీ టాపిక్ అయిపోయింది. కాకా స్థానంలో సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేయాలనే దిశగా యువి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వచ్చిన నేపథ్యంలో మెగా అభిమానుల్లో కొత్త కన్ఫ్యూజన్ మొదలైపోయింది. ఇది రెండు రోజులుగా జరుగుతున్నదే అయినా గంటకో కొత్త లీక్ వస్తూ లేనిపోని అయోమయాన్ని సృష్టిస్తోంది. నిజానికి మెగా ఫ్యాన్స్ పండక్కు ప్రిపేర్ అయ్యి ఉంది కాకా కోసం కానీ విశ్వంభర గురించి కాదు. అయితే ఇప్పుడు వరస మారితే ఎలా అనేదే క్వశ్చన్.
విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని క్రోడీకరిస్తే తేలుతున్న విషయాలు ఇవి. మొదటిది విశ్వంభర విఎఫ్ఎక్స్ పనులు దాదాపు అయిపోయాయి. ఫైనల్ కాపీ చాలా సంతృప్తికరంగా వచ్చిందట. దర్శకుడు వశిష్ఠతో పాటు టీమ్ మొత్తం చూసుకుని ఓకే అనుకున్నాక త్వరలోనే చిరంజీవికి చూపించాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇంకోవైపు ఓటిటిలతో చర్చలు జరుగుతున్నాయి. రషెస్ చూసిన రెండు సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని, సంక్రాంతి థియేటర్ రిలీజ్ అయితేనే తమ షెడ్యూల్ కు అనుకూలంగా ఉంటుందని తేల్చారట.
ఒకవేళ సంక్రాంతికి విశ్వంభరని విడుదల చేయాలంటే కాకాని తప్పించాలి. అదే జరిగితే మళ్ళీ ఇంకో మూడు నాలుగు నెలలు గ్యాప్ వస్తుంది. దీనికి దర్శకుడు బాబీ కొల్లి అంగీకరించడం లేదని వినికిడి. చిరంజీవి స్వయంగా బుజ్జగిస్తే నో చెప్పకపోవచ్చు. అయితే మరి కాకాని ఎప్పుడు రిలీజ్ చేయాలనేది పజిల్ గా మారిపోతుంది. విశ్వంభర ఓటిటి డీల్ కనక కుదరకపోతే నిక్షేపంగా పండక్కు కాకా వచ్చేస్తాడు. తక్కువ గ్యాప్ లో రెండు రావడం మాత్రం సేఫ్ కాదని బయ్యర్లు తేల్చి చెబుతున్నారు
ప్రస్తుతానికి ఈ ప్రచారాల సంగతి ఎలా ఉన్నా రెండు సినిమాల బృందాలు బయట పడటం లేదు. టాక్సిక్ వల్ల తీవ్ర నష్టాలు చవి చూసిన కెవిఎన్ సంస్థ తాజాగా హైవాన్ తోనూ అదే చవి చూసేలా ఉంది. దీంతో ఆశలన్నీ కాకా మీదే పెట్టుకుంది. ఇది కూడా వాయిదాల పర్వంలో పడితే ఇబ్బందే. అటు విశ్వంభర తీసిన యువి పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమి లేదు. మరి చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎలా దీన్ని పరిష్కరిస్తారో అనేది పెద్ద భేతాళ ప్రశ్న లాగా మారిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates