కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్ వచ్చి నాలుగు సంవత్సరాలు అయిపోయాయి. తాజాగా విడుదలైన సర్దార్ 2 ఫలితం ఉదయం ఆట నుంచే తేలిపోవడంతో ఫ్యాన్స్ తెగ బాధ పడుతున్నారు. 2022 సర్దార్ కొనసాగింపుగా దర్శకుడు పిఎస్ మిత్రన్ తీసిన భారీ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన మండాడికి పోటీ ఇవ్వలేక బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది.

2022 సర్దార్ మంచి హిట్. కాదనలేం. తెలుగులోనూ బాగా ఆడింది. నాలుగు డబ్బులు వచ్చాయి. అంత మాత్రాన దాని సీక్వెల్ కోసం విపరీతమైన క్రేజ్ లేదు. జనాలు ఖైదీ 2 కోరుకుంటూ వచ్చారు కానీ సర్దార్ 2 కాదు. అయినా సరే కార్తీ రిస్క్ చేశాడు. అలాంటాప్పుడు కథా కథనాలు నేలవిడిచి సాము చేయకూడదు. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ముఖ్యంగా దురంధర్ దెబ్బకు స్పై థ్రిల్లర్స్ చూసే దృక్పథం పూర్తిగా మారిపోయింది.

అలాంటప్పుడు సర్దార్ 2 పాత ట్రీట్ మెంట్, నమ్మశక్యం కానీ ఫైట్లతో, విలన్ ఎస్జె సూర్య అరుపులతో నింపేస్తే సక్సెస్ వచ్చేస్తుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. యాంటీ బయోటిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరమో చెప్పే ప్రయత్నం చేయడం మంచిదే. కానీ దానికి బిగుతైన స్క్రీన్ ప్లే, కట్టిపడేసే ట్విస్టులు, తుపాకీ తరహా కూల్ విలనీ అవసరం. అవి వదిలేసి గాల్లో గారడీలు చేసి మూడు గంటల పాటు థియేటర్లో కూచోబెడితే నెక్స్ట్ షోకి టికెట్లు తెంపడం పెద్ద సవాల్ అయిపోతుంది.

ఇకనైనా కార్తీ వీలైనంత త్వరగా మేలుకోవాలి. తన నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో గుర్తించాలి. అన్నయ్య సూర్య వరసగా వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ రూపంలో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు. నవంబర్ సీన్ తో మరోసారి రెడీ అవుతున్నాడు. కానీ కార్తీ కేసు రివర్స్ లో వెళ్తోంది. సంక్రాంతికి వచ్చిన వా వతియర్ (అన్నగారు వచ్చారు) దారుణంగా బోల్తా కొత్తగా ఇప్పుడీ సర్దార్ 2 కూడా అదే దారిలో వెళ్తోంది. నెక్స్ట్ మార్షల్ నిర్మాణంలో ఉంది. ఇదైనా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.