ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ క‌మ్యూనికేష‌న్, మార్కెటింగ్ స్కిల్స్‌తో వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటూ ఉంటారు. అందులో ర‌మేష్ వ‌ర్మ ఒక‌రు. ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌గా కెరీర్ ఆరంభించి ఒక ఊరిలో చిత్రంతో అత‌ను ద‌ర్శ‌కుడిగా మారాడు. విడుద‌ల‌కు ముందు మంచి హైప్ తెచ్చుకుంది కానీ.. ఆ సినిమా స‌రిగా ఆడ‌లేదు.

అయినా ర‌మేష్ వ‌ర్మ‌కు అవ‌కాశాలు ఆగిపోలేదు. రైడ్ సినిమాతో హిట్టు కొట్టాడు. కానీ అదేమీ త‌న ఒరిజిన‌ల్ స్టోరీ కాదు. ఒక కొరియ‌న్ మూవీకి ఫ్రీమేక్. అయినా ర‌మేష్ వ‌ర్మ‌కు డిమాండ్ పెరిగింది. బాలయ్య లాంటి పెద్ద హీరోతో ఓ సినిమా ఓకే అయింది. అది ముందుకు క‌ద‌ల‌క‌పోయినా ర‌వితేజ‌తో వీర చేశాడు. అది డిజాస్ట‌ర్ అయింది. త‌ర్వాత అమ్మాయితో అబ్బాయి కూడా పోయింది. ఆపై రాక్ష‌స‌న్ మూవీ రీమేక్ రాక్ష‌సుడుతో హిట్టు కొట్టాడు. మ‌ళ్లీ సొంత క‌థ‌తో ఖిలాడి సినిమా తీస్తే అదీ డిజాస్ట‌ర్ అయింది. నిర్మాత‌గా మొద‌ట్లో మ‌ల్లెపువ్వు, త‌ర్వాత‌ 7 అనే సినిమాలు చేస్తే అవీ ఆడ‌లేదు.

ఇలాంటి ఫిల్మోగ్ర‌ఫీతో ఇంకా ఇండ‌స్ట్రీలో ఉండ‌డ‌మే ఆశ్చ‌ర్య‌మంటే.. పెద్ద బ‌డ్జెట్ల‌లో సినిమాలు లైన్లో పెడుతూనే ఉండ‌డం షాకింగే. ఈ మధ్యే కర్ణుడి మీద యానిమేషన్ మూవీ ఒక‌టి ఎనౌన్స్ చేశాడు ర‌మేష్ వ‌ర్మ‌. ఇంత‌లోనే ఇప్పుడు ధ్రువ్ విక్ర‌మ్ లాంటి ప్రామిసింగ్ యంగ్ హీరోతో సినిమా ప్రకటించాడు. బైస‌న్ హిట్ట‌య్యాక ధ్రువ్‌కు బాగా డిమాండ్ ఏర్ప‌డింది. ఇలాంటి టైంలో అత‌ను, విక్రమ్ క‌లిసి ర‌మేష్ వ‌ర్మ సినిమాను ఓకే చెయ్యడం ఆశ్చర్యమే. జ‌యంతి లాల్ గ‌డ లాంటి పెద్ద బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ దీనికి నిర్మాత‌.

ఇప్ప‌టిదాకా సొంత క‌థ‌తో ఒక్క హిట్టు కొట్ట‌క‌పోయినా.. ఇన్నేళ్లు నిల‌బ‌డ‌డం, ఇప్ప‌టికీ ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులు ద‌క్కించుకోవ‌డం మామూలు విష‌యం కాదు. ఎంతో టాలెంట్ ఉండి, మంచి సినిమాలు తీసి కూడా కొంత‌మంది ద‌ర్శ‌కులు అవ‌కాశాలు లేక ఇబ్బంది ప‌డుతుంటే ర‌మేష్ వ‌ర్మ లాంటి వాళ్లకు మాత్రం భ‌లే క‌లిసొస్తుంటుంది.