ఇంద్ర చూపిన దారిలో మిగిలినవీ రావాలి

తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్ లైన్ లో అందుబాటులో లేకపోవడం. కొన్ని బ్యానర్లు అదే పనిగా 4కె చేయించినా ఏడాదికి ఒకసారి థియేటర్ రీ రిలీజ్ చేయడం కోసం వాటిని బుల్లితెరల మీద ఉంచడం లేదు. దీంతో సరైన నాణ్యత లేకుండా యూట్యూబ్, ఓటిటిలో వాటిని చూసి సర్దుకోవాల్సి వస్తోంది. ఈ విషయంలో నిర్మాత అశ్వినీదత్ తీసుకున్న చొరవని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి.

2002 ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఇంద్రని వైజయంతి మూవీస్ సంస్థ ఇటీవలే యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి తెచ్చింది. అది కూడా ఒరిజినల్ గా రీ మాస్టర్ చేసిన 4కె ప్రింటుతో. కేవలం నాలుగు రోజుల్లో ఒకటిన్నర మిలియన్లు దాటేసిన ఇంద్ర వ్యూస్ పరంగా కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణాలు లేకపోలేదు. 2014 తర్వాత చాలా సంవత్సరాలు ఇంద్ర కనీసం శాటిలైట్ ప్రసారానికి నోచుకోలేదు. మొన్నామధ్య ఒక ఛానల్ కు ఇచ్చారు.

రెండేళ్ల క్రితం రీ రిలీజ్ టైంలో థియేటర్లలో అభిమములు బాగా సందడి చేశారు. అయితే మళ్ళీ ఇది బుల్లితెరపై చూడాలంటే ఎలా అనుకున్న ఫ్యాన్స్ కోసం ఇంద్రని ఇలా అందుబాటులోకి తేవడం మంచి విషయం. ఇదే తరహాలో మురారి, శివ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఆది లాంటి క్లాసిక్స్ ని రీ మాస్టర్ ప్రింట్లతో ఆడియన్స్ కి అందుబాటులోకి తేవాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. అలా వచ్చిన వాటిలో ఆదిత్య 369 ఒకటే కొత్త ప్రింటుతో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.

ఇప్పటి జెన్ జీకి ఒకప్పటి మాస్టర్ పీసెస్ గురించి తెలియాలంటే ఇలా ఉచితంగా చూపించడం చాలా అవసరం. అందులోనూ క్వాలిటీకి ప్రాధాన్యం ఇచ్చే ఆడియన్స్ కి నాణ్యతలో ఏ మాత్రం తేడా అనిపించినా చూడటం మానేస్తున్నారు. అందుకే ఇంద్ర గురించి ఇంత ప్రత్యేకంగా ప్రస్తావించాల్సి వచ్చింది. యూట్యూబ్ తో పాటు ప్రైమ్ లోనూ రిలీజ్ చేయడం విశేషం. ఇంద్ర సరే దత్తుగారి బ్యానర్లోనే ఇంకా చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. వాటినెప్పుడు వదులుతారోనని ఫాన్స్ వెయిటింగ్.