డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్ గురించి ఎంత చెప్పినా పేజీలు సరిపోవు. 1996 సౌత్ మొత్తాన్ని ఊపేసిన ఒక బ్లాక్ బస్టర్ కొనసాగింపు ఇంత దారుణంగా ఉండటం సినీ ప్రియులు జీర్ణించుకోలేకపోయారు. సిద్దార్థ్, ప్రియా భవాని శంకర్ లాంటి కొత్త తరం ఆర్టిస్టులను తీసుకుని ఇంత అత్తెసరు అవుట్ ఫుట్ ఇవ్వడం పట్ల ఫ్యాన్స్ నిర్మొహమాటంగా ట్రోలింగ్ చేశారు. దెబ్బకు ఇండియన్ 3 ఊసులు ఆగిపోయాయి.

కట్ చేస్తే ఇప్పుడు మూడో భాగం విడుదలకు రంగం సిద్ధమవుతోందని చెన్నై మీడియా వర్గాల సమాచారం. శంకర్ ఆ దిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టారని, త్వరలోనే కొలిక్కి తెచ్చి రిలీజ్ డేట్ నిర్ణయిస్తారని తెలిసింది. నిజానికి అసలు కథ ఇండియన్ 3లోనే ఉంది. ఫస్ట్ పార్ట్ లో సుకన్యని పెళ్లి చేసుకున్న సేనాపతి ఆ తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో ఏం చేశాడనేది చూపించలేదు. నేరుగా ఇండిపెండెన్స్ వచ్చినట్టు ముగించి వర్తమానంలోకి తెచ్చారు.

ఇప్పుడా ప్రశ్నకు సమాధానం ఇండియన్ 3లో దొరకనుంది. దాదాపుగా షూట్ మొత్తం పూర్తయిన ఈ సీక్వెల్ కు సంబంధించి బాలన్స్ ఏదైనా ఉంటే సహకారం అందిస్తానని కమల్ హామీ ఇచ్చినట్టు వినికిడి. దీని వల్ల విపరీత నష్టాలకు గురైన లైకా సంస్థ తిరిగి ఎంత పెట్టుబడి పెడుతుందనేది బయటికి రాలేదు. ఇండియన్ 2లో పాటలు, బీజీఎమ్ తో నిరాశ పరిచిన అనిరుధ్ రవిచందర్ ఈసారైనా అంచనాలకు తగ్గట్టు మంచి అవుట్ ఫుట్ ఇవ్వాలని మ్యూజిక్ లవర్స్ కోరిక.

అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడీ డిజాస్టర్ తాత కంటిన్యూయేషన్ ని జనాలు రిసీవ్ చేసుకుంటారా అనేది అనుమానంగానే ఉంది. బిజినెస్ పరంగా పెద్దగా అద్భుతాలు జరగకపోవచ్చు. ఎందుకంటే మునుపటి నష్టాల సెటిల్ మెంటే ఇంకా బోలెడు పెండింగ్ ఉందట. సో ఆ సర్దుబాట్లు గట్రా అయ్యాకే నెంబర్ల గురించి క్లారిటీ వస్తుంది. సుకన్య స్థానంలో కాజల్ అగర్వాల్ నటించిన ఇండియన్ 3లో కమల్ హాసన్ వృద్ధుడి గెటప్ కన్నా ఎక్కువగా మధ్య వయసు యువకుడిగా కనిపించబోతున్నారు.