సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మాత్రం వీటికి భిన్నంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటోంది.
హెచ్‌పీవీ (HPV) అవగాహన ప్రచారాన్ని మరింత విస్తరిస్తూ, ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అల్లు అర్జున్ అభిమానులు వివిధ పాఠశాలల్లో 820 అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, దాదాపు 3 లక్షల మంది విద్యార్థినులను చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు అండమాన్ & నికోబార్ దీవులలో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియా పోస్టులకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లడం విశేషం. AAFA వాలంటీర్లు స్వయంగా పాఠశాలలకు వెళ్లి బాలికలతో మాట్లాడారు. హెచ్‌పీవీ నివారణ, వ్యాక్సినేషన్ గురించి వారిలో చైతన్యం తెప్పించారు. విద్యార్థినులతో పాటు వారి కుటుంబాలలో అవగాహన పెంచడమే కాకుండా, సరైన సమాచారం మరియు టీకాలకు సంబందించిన వైద్యులను ఎలా సంప్రదించాలో వివరించారు.
ఈ కార్యక్రమం చేపట్టిన తీరు అల్లు అర్జున్ అభిమానుల నెట్‌వర్క్ ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తోంది. పాన్-ఇండియా స్టార్‌గా ఆయన ఎదుగుదలతో పాటు, వివిధ రాష్ట్రాలు మరియు భాషల్లో అభిమాన సంఘాలు పటిష్టంగా విస్తరించాయి. సినిమాలను దాటి, ఆ ఉమ్మడి శక్తిని ఇలాంటి మంచి సామాజిక కార్యక్రమాలకు ఉపయోగించడానికి AAFA ప్రస్తుతం కృషి చేస్తోంది. అవగాహనతో పాటు అమ్మాయిల్లో అంతులేని ఆత్మస్థైర్యం పెంచుకునేలా నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
దశాబ్దాలుగా ప్రేక్షకులతో తన అనుబంధాన్ని ఎంతగానో పెంచుకున్న అల్లు అర్జున్ దేశవ్యాప్త ప్రభావానికి ఈ కార్యక్రమం సరికొత్త అర్థాన్ని చేకూరుస్తోంది. ప్యాన్ ఇండియా ఇమేజ్ లోని బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చేలా తన ఫ్యాన్స్ కి స్ఫూర్తినిస్తున్న తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో వీటిని ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేసి లక్షలాది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా అభిమానులు చేపడుతున్న పనులు రోల్ మోడల్ లా నిలుస్తున్నాయి. కొత్త చైతన్యం తీసుకొచ్చేందుకు పాటు పడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates