బేబీ జంటకు ‘ఎపిక్’ ఎగ్జామ్  

రేపు విడుదల కాబోతున్న ఎపిక్ ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు వేయనుంది. హైదరాబాద్ ఒకటే కాకుండా ఏపీ, తెలంగాణ ప్రధాన కేంద్రాలలోనూ ప్రదర్శించబోతున్నారు. కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న నిర్మాత నాగవంశీ, దర్శకుడు ఆదిత్య హాసన్ సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చినా సరే సక్సెస్ పట్ల ధీమాగా ఉన్నారు. చిన్నపిల్లలు టార్గెట్ కాదు కానీ పెద్దవాళ్ళు, కుటుంబాలు, యువత అందరూ చూసేలా, ఆలోచింపజేసేలా ఉంటుందని ఇంటర్వ్యూలలో హామీ ఇస్తున్నారు.

అయితే ఎపిక్ సక్సెస్ అందరికన్నా ఎక్కువగా బేబీ జంటకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ బ్లాక్ బస్టర్ తర్వాత ఇద్దరికీ హిట్టు పడలేదు. ఆనంద్ దేవరకొండ బిజీగానే ఉన్నాడు కానీ ఎందుకో టైం ప్రకారం ఒక క్రమపద్ధతిలో రిలీజులు జరగడం లేదు. ఇప్పుడీ ఎపిక్ కనక విజయవంతమైతే తన మార్కెట్ మరింత పెరుగుతుంది. అన్న విజయ్ దేవరకొండ తమ్ముడనే బ్రాండ్ నుంచి పూర్తిగా బయట పడాలంటే సాలిడ్ గా రెండు మూడు బ్లాక్ బస్టర్లు పడాలి. దానికి ఎపిక్ బోణీ కావాలనేది అతని ఆకాంక్ష.

ఇక వైష్ణవి చైతన్య విషయానికి వస్తే బేబీ తర్వాత చేసిన లవ్ మీ, జాక్ రెండూ బోల్తా కొట్టాయి. నటన పరంగా తన మీద ఎలాంటి కంప్లయింట్స్ లేనప్పటికీ కాంబోల ఎంపికలో చేస్తున్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. వైష్ణవికి స్టార్ హీరోల పక్కన అవకాశాలు రావడం లేదు. చూసేందుకు లుక్స్ పరంగా వయసు తక్కువగా కనిపించడమే దీనికి కారణం. అయితే ఎపిక్ లో మరోసారి మెప్పిస్తే మటుకు ట్రెండ్ లో ఉన్న యూత్ హీరోలు తన వైపు చూసే ఛాన్స్ ఉంది.

ఇక బాక్సాఫీస్ సంగతి చూస్తే ఇరుముడి మెల్లగా తగ్గుముఖం పట్టింది. వీకెండ్స్ బాగున్నాయి కానీ ఇరవై రోజుల తర్వాత కూడా మునుపటి దూకుడు ఆశించడం అత్యాశవుతుంది. సో ఎపిక్ కు మంచి ఛాన్స్ ఉంది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ వచ్చినా చాలు రెండు మూడు వారాలు ఈజీగా ఆధిపత్యం చెలాయించవచ్చు. పోటీలో వేరే సినిమాలు ఉన్నాయి కానీ జానర్ పరంగా చూసుకుంటే యువతకు మొదటి ఛాయస్ ఎపిక్ కానుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటే బేబీ జోడికి హిట్టు పడినట్టే.