ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే మాస్ రాజా రవితజ తనయుడు మహాధన్ ఆల్రెడీ కెమెరా ముందుకు వచ్చేశాడు. ‘రాజా ది గ్రేట్’లో చిన్నప్పటి రవితేజగా కనిపించాడీ కుర్రాడు. అందులో మహాధన్ కనిపించింది కాసేపే అయినా తనదైన ముద్ర వేశాడు. 

అతడి జోరు చూస్తే త్వ‌ర‌గానే హీరో అయిపోతాడ‌నిపించింది. కానీ త‌ర్వాత అత‌ను గ్యాప్ తీసుకున్నాడు. మ‌ధ్య‌లో రూటు మార్చి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అవ‌తారం ఎత్త‌డంతో న‌ట‌న‌లోకి వ‌చ్చే ఉద్దేశం లేదా అన్న సందేహం కూడా క‌లిగింది. కానీ మ‌హాధ‌న్ అంతిమ ల‌క్ష్యం హీరో కావ‌డ‌మే అని వెల్ల‌డైంది. ఈ విష‌యాన్ని అత‌డి క‌జిన్ మాధ‌వ్ భూప‌తిరాజు వెల్లడించాడు.
మాధ‌వ్ మారెమ్మ అనే చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హాధ‌న్ కెరీర్ గురించి మాట్లాడాడు మాధ‌వ్.

సినిమాకు సంబంధించి అన్ని విభాగాల మీద అవ‌గాహ‌న తెచ్చుకునే క్ర‌మంలోనే మ‌హాధ‌న్ ఏడీ అవ‌తారం ఎత్తిన‌ట్లు అత‌ను చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ మ‌హాధ‌న్ ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ అని.. అందుకే ఆయ‌న ద‌గ్గ‌ర అత‌ను ప‌ని చేస్తున్నాడ‌ని మాధ‌వ్ చెప్పాడు. మ‌హాధ‌న్ అంతిమంగా హీరోనే అవుతాడ‌ని.. అది ఎప్పుడ‌న్న‌ది త్వ‌ర‌లోనే తెలుస్తుందని మాధ‌వ్ వ్యాఖ్యానించాడు. 

మ‌హాధ‌న్ స్పిరిట్ మూవీకి సందీప్ దగ్గ‌ర ప‌ని చేస్తున్నాడు. ఇటీవ‌ల చిరంజీవి పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని స్పిరిట్ టీం అంతా సందీప్ ఇంట్లో చిరు ఫ్రేమ్ ద‌గ్గర దిగిన ఫొటోతో విషెస్ చెప్ప‌గా.. అందులో మ‌హాధ‌న్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మ‌హాధ‌న్ వ‌య‌సు 20 ఏళ్లు. ఇంకో రెండు మూడేళ్ల‌లో అత‌ను హీరో అవ‌తారం ఎత్తే అవ‌కాశ‌ముంది. అత‌డి సోద‌రి మోక్ష‌ద ఇరుముడి సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా త‌న ప్ర‌తిభ‌ను చాటుకుంది.