చైతు & దుల్కర్ – లక్కీ ఛాన్స్ కొట్టేశారా?

పెద్ద బడ్జెట్లు ముడిపడిన సినిమాలకు రిలీజ్ డేట్లు లాక్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ముందు వెనుక పోటీ లేకుండా చూసుకుందామంటే సరైన స్లాట్స్ దొరకడం లేదు. దానికి తోడు బిజినెస్ వ్యవహారాలు, ఓటిటి నుంచి అనుకున్న రేట్లు రాకపోవడాలు ఇలా ఎన్నో కారణాలు ఆలస్యానికి దారి తీస్తున్నాయి. నాగ చైతన్య ప్యాన్ ఇండియా మూవీ వృషకర్మ కూడా ఈ లిస్టులో ఉంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ చివరి దశ పనుల్లో తుది మెరుగులు దిద్దుకుంటోంది.

ఫౌజీ వాయిదా గురించి వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో వృషకర్మని డిసెంబర్ 3 లేదా 4 విడుదల చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. ట్విట్టర్ హ్యాండిల్ లో చైతు ఈ విషయం గురించే నర్మగర్భంగా ట్వీట్ చేయడంతో అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. ఎలాగూ కింగ్ 100కు దీనికి ఇరవై రోజుల గ్యాప్ వస్తుంది కాబట్టి తండ్రి కొడుకుల క్లాష్ అనే ఇబ్బంది తలెత్తదు. సెట్స్, ఇంటీరియర్స్ కోసమే భారీగా ఖర్చు పెట్టిన వృషకర్మ థియేటర్ బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఇక్కడితో అయిపోలేదు. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ కూడా డిసెంబర్ 4 వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కు రవి నెలకుడితి దర్శకుడిగా వ్యవహరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్ దీని మీద ఆసక్తి వచ్చేలా చేసింది. టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీగా రూపొందుతున్న శ్రీశ్రీకి నిర్మాత సుధాకర్ చెరుకూరి. రిలీజ్ ప్లానింగ్ గట్టిగా ఉంటుందని చెప్పడంలో డౌట్ లేదు.

సో ఫౌజీ వదిలేసిన అవకాశాన్ని చైతు, దుల్కర్ ఇద్దరూ వాడుకోబోతున్నారన్న మాట. నిజానికిది చాలా మంచి స్లాట్. అఖండ, యానిమల్, పుష్ప 2 సరిగ్గా ఇదే డిసెంబర్ మొదటి వారంలో వచ్చి బ్లాక్ బస్టర్స్ సాధించాయి. వందల కోట్లు వసూళ్లు చూపించాయి. అందుకే ఫౌజీ కూడా అదే రూట్లో వెళ్లాలనుకుంది కానీ బ్యాడ్ లక్ వెంటాడింది. నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్ కన్నా ముందుగానే విశ్వక్ సేన్ లెగసీ ఆల్రెడీ కొత్త పోస్టర్ రూపంలో తన రిలీజ్ డేట్ ని అధికారికంగా లాక్ చేసుకుంది.