దెబ్బ మీద దెబ్బ.. అయినా తగ్గేదేలే

గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక నష్టాలు ఎదుర్కొన్న సంస్థ అంటే.. కేవీఎన్ ప్రొడక్షన్స్ అనే చెప్పాలి. కేడీ, జననాయగన్, టాక్సిక్, కాకా లాంటి భారీ చిత్రాలను లైన్లో పెట్టిన ఈ సంస్థ.. ఉన్నట్లుండి సౌత్ ఇండియాలో అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్‌గా అవతరించింది. ఈ సినిమాలన్నీ అంచనాలకు తగ్గ ఫలితాలు అందుకుంటే.. కేవీఎన్ రేంజే మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ క్రేజీ కాంబినేషన్లలో సినిమాలైతే సెట్ చేసుకుంది కానీ.. తమ చిత్రాలను విజయవంతం చేసుకోవడంలో మాత్రం ఈ సంస్థ విఫలమవుతోంది.

కొన్ని నెలల వ్యవధిలో రిలీజైన కేడీ, జననాయగన్, టాక్సిక్ నిర్మాణ వెంకట్.కె.నారాయణకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. వీటిలో ‘జననాయగన్’ అంచనాలకు మించి వసూళ్లే రాబట్టినా.. విపరీతంగా ఆలస్యం కావడం, విడుదలకు ముందే ఆన్ లైన్లో లీక్ కావడం వల్ల భారీ నష్టమే మిగిల్చింది. ఇక ‘టాక్సిక్’ కొట్టిన దెబ్బ అయితే మామూలుది కాదు. థియేటర్ల నుంచి పెట్టుకున్న టార్గెట్‌లో సగం కూడా వెనక్కి రాలేదు. ఇప్పుడేమో డిజిటల్ రైట్స్‌కు ఓటీటీ సంస్థ మరీ తక్కువ ఆఫర్ చేస్తోంది. దీంతో నిర్మాత పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు.

ఐతే ఇలాంటి సంకట స్థితిలో కూడా కేవీఎన్ సంస్థ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో తమ కొత్త సినిమాను ప్రకటించింది కేవీఎన్ ప్రొడక్షన్స్. రేపు ఉదయం 11.09 గంటలకు ఈ సినిమా విశేషాలను పంచుకోనున్నట్లు తెలిపింది. పోస్టర్లో మెట్ల మీద అడుగులేస్తున్న ఒక వ్యక్తి కాళ్లు కనిపిస్తున్నాయి. ఇక పోస్టర్ మీద ఇంగ్లిష్‌లో ఎం, డి అనే అక్షరాల మధ్య ఖాళీలు వదిలిపెట్టి ప్రేక్షకులను గెస్సింగ్ మోడ్‌లోకి నెట్టారు. ఆ అక్షరాలను పూరించి సినిమా విశేషాలు తెలుసుకోమని హింట్ ఇచ్చారు.

ఆ లెటర్స్‌ను పూర్తి మురుగదాస్ అని వచ్చేలా ఉండడంతో ఈ సీనియర్ దర్శకుడితోనే కేవీఎన్ సంస్థ సినిమా తీయబోతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరి రేప్పొద్దున కేవీఎన్ అనౌన్స్ చేసే సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి మరి. ఏదేమైనా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా.. కేవీఎన్ ఏమాత్రం తగ్గకుండా కొత్త సినిమాను అనౌన్స్ చేయబోతుండడం ఆశ్చర్యమే.