హీరోయిన్ల మీద స్పై చేస్తానంటున్న నిర్మాత‌

టాలీవుడ్ నిర్మాత‌ల్లో సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ది డిఫ‌రెంట్ స్టైల్. చాలామంది ప్రొడ్యూస‌ర్ల‌లా న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడ‌డు నాగ‌వంశీ. సోష‌ల్ మీడియా దృష్టిని ఆక‌ర్షించేలా సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ పంచ్‌లు వేయ‌డంలో ఆయ‌న దిట్ట‌. కొన్నిసార్లు నాగ‌వంశీ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం కూడా అవుతుంటాయి. స్టేజ్ ఎక్కి మాట్లాడినా.. ఇంట‌ర్వ్యూలు ఇచ్చినా.. నాగ‌వంశీ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తాడ‌న్న‌ది మాత్రం వాస్త‌వం.

తాజాగా కార్తి సినిమా స‌ర్దార్-2 తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వ‌చ్చిన నాగ‌వంశీ.. అక్క‌డ కూడా త‌న మార్కు చూపించాడు. స‌ర్దార్-2లో హీరో స్పై పాత్ర‌ను పోషించిన నేప‌థ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన అతిథులను.. యాంక‌ర్ సుమ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగింది. ఇందులో భాగంగా నాగ‌వంశీని మీరు ఎవ‌రి మీద స్పైయింగ్ చేయాల‌నుకుంటారు అని ప్ర‌శ్నించింది.

ఈ ప్ర‌శ్న‌కు నాగ‌వంశీ స‌మాధానం ఇస్తూ.. తాను హీరోయిన్ల మీద స్పైయింగ్ చేయాల‌నుకుంటాన‌ని చెప్పాడు. ఏ హీరోయిన్ని డేట్ల కోసం అడిగినా, కాల్ షీట్లు ఖాళీ లేద‌నే చెబుతుంద‌ని.. అస‌లు నిజంగా వాళ్లు అంత బిజీగా ఉంటారా అని తెలుసుకోవాల‌ని ఉంద‌ని చెప్పాడు. హీరోల‌తో పాటు మిగ‌తా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు ఎవ్వ‌రూ అంత బిజీగా ఉండ‌ర‌ని.. ఒక్క హీరోయిన్లు అడిగితేనే ఖాళీ లేదు, బిజీ అని చెబుతార‌ని.. నిజంగా వాళ్లు అంత‌గా బిజీగా ఉంటారా అన్న‌ది త‌న డౌట్ అని నాగ‌వంశీ అన‌డంతో ఈవెంట్‌కు హాజ‌రైన అంద‌రూ న‌వ్వేశారు.

స‌ర్దార్-2 హీరోయిన్లు ఆషికా రంగ‌నాథ్, మాళ‌విక మోహ‌న‌న్ మీకు అలా చెప్పారా అని అడిగితే.. ఆషికా త‌మ బేనర్లో సినిమా చేస్తోంద‌ని, మాళ‌విక గురించి త‌నకు తెలియ‌ద‌ని.. ఆమెతో ఇంకా తాను సినిమా చెయ్యలేదని నాగవంశీ అన్నాడు. ఇక కార్తీతో తాను చేస్తున్న సినిమా (మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో) వచ్చే ఏడాది వేసవిలో వస్తుందని ఈ సందర్భంగా నాగవంశీ చెప్పాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో గజిని నాటి సూర్యను చూపించామని, కళ్యాణ్ శంకర్ సినిమాలో ఆవారా రోజుల నాటి కార్తిని బయటికి తీస్తామని ఆయన అన్నాడు.