బుల్లితెరపైనే కాదు… వెండితెరపైనా సంచలనమే

ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్‌ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో అత్యధిక ఆదరణ తెచ్చుకున్న సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అగ్రస్థానంలో నిలిస్తే.. ‘మీర్జాపూర్’ది రెండో స్థానం. మాస్, యాక్షన్ ప్రియుల్లో అయితే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ను మించి ఫాలోయింగ్ సంపాదించుకుందీ సిరీస్. రా అండ్ రస్టిగ్గా తెరకెక్కిన ఈ సిరీస్‌లో బూతులు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. 

తెలుగు వాళ్లు కూడా ఈ సిరీస్‌కు బాగా కనెక్టయ్యారు. త్రిపాఠి, మున్నా, గుడ్డూ, బబ్లూ, బీనా ఆంటీ లాంటి పాత్రలు మన వాళ్లపై బలమైన ముద్రే వేశాయి. దివ్యేందుకు ‘పెద్ది’ లాంటి పెద్ద సినిమాలో అవకాశం దక్కిందంటే ‘మీర్జాపూర్’లో మున్నా పాత్రతో వచ్చిన పాపులారిటీనే కారణం. తొలి సీజన్ తర్వాత ఇంకో రెండు సీజన్లతో అలరించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు సినిమాగా కూడా ఆకట్టుకుంటోంది.

గత వారాంతంలోనే ‘మీర్జాపూర్’ సినిమాను వెండితెరల్లోకి తీసుకొచ్చారు. ఈ సినిమా యావరేజ్ రివ్యూలు తెచ్చుకుంది. అయినా సరే దేశవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. స్టార్లు లేకపోయినా.. ‘మీర్జాపూర్’ సిరీస్‌తో వచ్చిన బ్రాండ్ వాల్యూతో, బలమైన కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. తొలి రోజే ఇండియాలో రూ.28 కోట్ల దాకా నెట్ వసూళ్లు రాబట్టిన ‘మీర్జాపూర్’.. రెండో రోజు రూ.32 కోట్లు కొల్లగొట్టింది.

ఆదివారం వసూళ్లు ఇంకా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్లో ఇండియాలో దాదాపు రూ.100 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది చిత్రం. పెద్ద పెద్ద స్టార్లతో సమానమైన వీకెండ్ వసూళ్లు ఇవి. దీన్ని బట్టే ‘మీర్జాపూర్’ బ్రాండు ఎలా పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. విక్రాంతి మాస్సే మినహా ‘మీర్జాపూర్’ సిరీస్ ముఖ్య పాత్రధారులందరూ సినిమాలోనూ కనిపించారు. గుర్మీత్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఇంకో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఫర్హాన్ అక్తర్ నిర్మించాడు.