అక్కినేని కుటుంబం నుంచి చివరగా హీరో అయిన అఖిల్‌కు అభిమానులు ప్రత్యేకంగా ఏ బిరుదూ ఇవ్వలేదు. కానీ అనుకోకుండా అతడి పేరు వెనుక అయ్యగారు అనే ట్యాగ్ వచ్చి చేరిపోయింది. ఇదంతా నాగరాజు అనే ఒక వీరాభిమాని పుణ్యమే. గతంలో ఎప్పుడో ఒకసారి అతను అఖిల్‌ను ఉద్దేశించి అయ్యగారే నంబర్ వన్ అనే కామెంట్ చేయడంతో సోషల్ మీడియాలో ఆ వీడియో బాగా పాపులర్ అయి.. నెటిజన్లు అఖిల్‌ను అయ్యగారు అనడం మొదలుపెట్టారు.
కొందరు సరదాకు ఈ మాట అంటారు. కొందరు వెటకారాలాడతారు. ఏదైతేనేం అఖిల్ అయ్యగారిగానే పాపులర్ అయిపోయాడు. స్వయంగా అఖిల్ ఈ అభిమానిని గుర్తించి కలవడంతో అయ్యగారు ట్యాగ్ మరింత బలపడిపోయింది. ఐతే మరో అక్కినేని కుటుంబ హీరో సుమంత్ మాత్రం అయ్యగారు ట్యాగ్ తనదంటుండడం విశేషం.
తన కొత్త చిత్రం మహేంద్రగిరి వారాహి ప్రి రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సుమంత్ ఈ కామెంట్ చేశాడు. ఈ వేడుకకు అఖిల్ అతిథిగా రాగా.. ఫ్యాన్స్ అయ్యగారు అయ్యగారు అంటూ అరిచారు. దీనిపై సుమంత్ స్పందిస్తూ.. తమ కుటుంబంలో అతి పెద్ద మనవడిని తానే అని, అయ్యగారు అనే ట్యాగ్ ఇస్తే తనకే ఇవ్వాలని, అఖిల్‌కు కాదని చమత్కరించాడు. తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. చిన్నవాడైనా తన సినిమాకు సపోర్ట్ చేయడానికి అఖిల్ వచ్చాడని.. లెనిన్ రూపంంలో అతడికి పెద్ద హిట్ పడడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని సుమంత్ తెలిపాడు.
అఖిల్ సక్సెస్ అయితే అత్యంత సంతోషించేవాళ్లలో తాను ముందుంటానని.. ఆ విషయం తనకు కూడా తెలుసని సుమంత్ అన్నాడు. లెనిన్ మూవీని చివరి 40 నిమిషాల్లో తన భుజాల మీద అఖిల్ క్యారీ చేసిన విధానం అద్భుతమని.. అక్కడ అతనెంతో మెచ్యూరిటీ చూపించాడని.. రెండోసారి ఈ సినిమా చూసినపుడు అతడి నటనలో ప్రత్యేకత తనకు అర్థమైందని చెప్పాడు సుమంత్. మహేంద్రగిరి వారాహి ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates