ఇప్పటిదాకా తెలుగు తెరమీద వందలాది నక్సల్స్ సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో సాగేవే. ఎర్ర సైన్యం, ఎర్ర మల్లెలు, ఒసేయ్ రాములమ్మ, అడవిలో అన్న, దండోరా, స్వర్ణక్క లాంటి సూపర్ డూపర్ హిట్స్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ భూతద్దం పెట్టి వెతికినా కనిపించవు. కామెడీ ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఈ జానర్ అలాంటిది కాబట్టి. ఆ మధ్య అల్ట్రా డిజాస్టర్ ఆచార్యలోనూ చిరంజీవి, రామ్ చరణ్ నక్సలైట్లుగా కనిపిస్తే జనాలు బాబోయ్ అనేశారు.
వీటి సంగతలా ఉంచితే హీరో శ్రీవిష్ణు ఎవరికీ దక్కని ఒక వెరైటీ పాయింట్ పట్టేశాడు. అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్ లో పని చేసే ఒక కుర్రాడు అనుకోకుండా అడవుల్లో నక్సలైట్ల పంచన చేరతాడు. అక్కడ తమాషాలు చేస్తూ వాళ్లకు కూడా సరదా అంటే ఏంటో నేర్పిస్తాడు. అసలు సంబంధం లేని రెండు బ్యాక్ డ్రాప్ల మధ్య స్టోరీ ఎలా షిఫ్ట్ అయ్యిందనేది ఇంకో నెల తర్వాత థియేటర్ స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది.
శ్రీవిష్ణు చాలా జోవియల్ గా పాత్రను పండించడం కామ్రేడ్ కళ్యాణ్ లో హైలైట్ గా నిలుస్తోంది. ఇప్పుడు నక్సల్స్ ట్రెండ్ లేదు కాబట్టి పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు కానీ ఇదే ఒక ఇరవై సంవత్సరాల క్రితం అయితే సెన్సార్ చిక్కులు కూడా వచ్చేవేమో. ఇది ముందే పసిగట్టి గెస్టుగా వచ్చిన వాళ్లలో ఒకరిద్దరు ఇదే విషయం మీద అనుమానం వ్యక్తం చేశారు కూడా. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన కామ్రేడ్ కళ్యాణ్ కు కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరించారు.
ఒకవేళ ఈ కాన్సెప్ట్ కనక క్లిక్ అయితే ఇతర రచయితలు ఇలాంటివి ట్రై చేస్తారేమో చూడాలి. అక్టోబర్ లో కాంపిటీషన్ టఫ్ గా ఉన్నప్పటికీ కామ్రేడ్ కళ్యాణ్ ఈ డేట్ ఎంచుకోవడం గమనార్హం. ప్యారడైజ్, ఆదర్శ కుటుంబం, ఏకె 47, జైలర్ 2, రణబాలి లాంటి క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ ని ముందు వెనుక పెట్టుకుని రిస్క్ చేయడం చూస్తుంటే కంటెంట్ మీద గట్టి నమ్మకమే కనిపిస్తోంది. అన్నట్టు టీజర్ లాంచ్ ఈవెంట్ కి పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి రావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates