పండగ సీజన్ కాదు. తెలుగు నుంచి పెద్ద స్టార్ హీరో సినిమా కూడా లేదు. అయినా సెప్టెంబర్ రెండో వారంలో థియేటర్ల దగ్గర మాత్రం ఖాళీ కనిపించడం లేదు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లోనే ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కార్తి సర్దార్ 2, సూరి, సుహాస్ ‘మండాడి’, మాధవ్ ‘మారెమ్మ’ ఒకరోజు వస్తుంటే, మరుసటి రోజు ఆనంద్ దేవరకొండ ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్, సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ రిలీజ్ అవుతున్నాయి.
ఈ ఐదింటిలో ప్రస్తుతం పెద్ద రిలీజ్‌గా కనిపిస్తున్నది ‘సర్దార్ 2’. మొదటి భాగం తెలుగులోనూ ఆడటం, కార్తికి ఇక్కడ సొంత మార్కెట్ ఉండటంతో ఎక్కువ స్క్రీన్స్ కోసం ఈ సినిమా ముందుంటుంది. అదే రోజు వస్తున్న ‘మండాడి’లో సూరితో పాటు సుహాస్ కూడా ఉండటం తెలుగు మార్కెట్‌కు ఉపయోగపడే అంశం. సముద్రం, పడవ పోటీల బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా వస్తోంది.
‘మారెమ్మ’ మాత్రం మరో లెక్క. రవితేజ కుటుంబం నుంచి మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఇది. గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాకు పెద్ద స్టార్ పవర్ లేదు. అందుకే మొదటి రోజు దక్కే థియేటర్ల కంటే, టాక్ వచ్చిన తర్వాత షోలు పెరగడం దీనికి ఎక్కువ అవసరం. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఎలాంటి స్పందన వస్తుందన్నది చూడాలి.
సెప్టెంబర్ 11న వచ్చే సినిమాలు ఇంకాస్త డిఫరెంట్. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ కలిసి చేస్తున్న ‘ఎపిక్’ యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’ మాత్రం మైథాలజీ, అడ్వెంచర్ వైపు వెళ్తోంది. పైగా సర్దార్ 2, ఎపిక్ ను తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్తుండగా, ‘మండాడి’ మైత్రి చేతిలో ఉంది.
అందుకే ఈసారి హైదరాబాద్ మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్క్రీన్ పంచుకోవడంలో పోటీ తప్పదు. సెప్టెంబర్ 10 ఉదయం పడే టాక్‌తోనే కొన్ని సెంటర్లలో మరుసటి రోజు షోలు మారే అవకాశం ఉంటుంది. పైగా 11న మరో రెండు సినిమాలు జాయిన్ అవుతాయి. ఇక వీకెండ్ ను ఏ సినిమా బాగా యూజ్ చేసుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates