టాక్సిక్ వ‌ల్లే కాలేదు… వీటి వ‌ల్ల‌వుతుందా?

టాలీవుడ్ గత పుష్క‌ర కాలంలో పాన్ ఇండియా స్థాయిలో బాహుబ‌లి, పుష్ప లాంటి అసాధార‌ణ విజ‌యాల‌ను చూసింది. కానీ ఇప్పుడు ఇరుముడి సినిమా గ‌త రెండు వారాలుగా సాగిస్తున్న ప్ర‌భంజ‌నం చాలా ప్ర‌త్యేక‌మైంది. ఇదేమీ భారీ తారాగ‌ణం ఉన్న పెద్ద బ‌డ్జెట్ సినిమా కాదు. విజువ‌ల్‌గా మ‌తులు పోగొట్టే మూవీ కాదు. ఇందులో పెద్ద‌గా హీరోయిజం ఉండ‌దు. మాస్ అంశాలు త‌క్కువ‌. అయినా ఈ క‌థ‌కు తెలుగు ప్రేక్ష‌కులు విప‌రీతంగా క‌నెక్ట్ అయ్యారు. ఇందులోని ఎమోష‌న్ల‌కు క‌దిలిపోయారు.

దీంతో తొలి రోజు నుంచి వ‌సూళ్ల మోత మోగిస్తూ సాగిపోతోంది మాస్ రాజా సినిమా. ఇప్ప‌టికే వ‌సూళ్లు రూ.200 కోట్ల మార్కును దాటేశాయి. సినిమా మూడో వీకెండ్లోకి అడుగు పెట్టేసింది. అయినా ఈ సినిమా జోరు త‌గ్గ‌ట్లేదు. గ‌త వారం టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా మూవీ వ‌చ్చినా.. ఇరుముడిని క‌దిలించ‌లేక‌పోయింది. ఆ సినిమా రిలీజ్ రోజు కాస్త జోరు త‌గ్గించి మ‌ళ్లీ ఊర మాస్ బ్యాటింగ్‌ను కొన‌సాగించిందీ చిత్రం.

అంత పెద్ద సినిమానే ఇరుముడి మీద ప్ర‌భావం చూపించ‌లేదంటే.. ఈ వారం వ‌చ్చిన చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాలు దాన్నేం చేయ‌గ‌ల‌వు. ఐతే ఈ వారం చిత్రాల్లో దేనికైనా కంటెంట్ గొప్ప‌గా ఉండి, అదిరిపోయే టాక్ తెచ్చుకుంటే ఏమైనా ప్ర‌భావం ఉండేదేమో కానీ.. అలా ఏ సినిమా ప్రేక్ష‌కుల మెప్పు పొందే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అల్ల‌రి న‌రేష్ సినిమా రంభ ఊర్వ‌శి మేన‌కకి నెగెటివ్ టాక్ రాగా.. సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్ చేసిన రోమాంచ‌క యావ‌రేజ్ టాక్‌తో స‌రిపెట్టుకుంది.

దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీ ఐమ్ గేమ్‌కు రివ్యూలు, టాక్ అంతంత‌మాత్రంగా ఉన్నాయి. చిన్న సినిమాల్లో సంచ‌లనం రేపుతుంద‌ని ప్ర‌చారం చేసిన స‌హ కూడా అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. దీంతో ఇరుముడికి ఈ వారం కూడా ఎదురు లేద‌ని తేలిపోయింది. కొత్త సినిమాల‌ను వెన‌క్కి నెట్టి ఆ సినిమానే బాక్సాఫీస్ లీడ‌ర్‌గా కొన‌సాగ‌బోతోంద‌ని స్ప‌ష్ట‌మైంది. ఈ నెల చివ‌రి వారంలో నాని మూవీ ది ప్యార‌డైజ్ వ‌చ్చే వ‌ర‌కు ఇరుముడికి ఎదురు ఉండ‌క‌పోవ‌చ్చనిపిస్తోంది. వ‌చ్చే వారం రానున్న ఎపిక్, స‌ర్దార్-2 చిత్రాలేమైనా దీని జోరుకు అడ్డుక‌ట్ట వేస్తాయేమో చూడాలి.