ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న తాప్సి కొన్నేళ్లుగా పూర్తిగా బాలీవుడ్ కే అంకితమైపోయింది. అదృష్టవశాత్తు పెర్ఫార్మన్స్ చేసే పాత్రలు దక్కడంతో కెరీర్ బాగానే సాగుతోంది. కాకపోతే ఆశించిన స్థాయిలో స్పందన, సక్సెస్ దక్కడం లేదు. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో గాంధారి తో ప్రేక్షకులను పలరించిన తాప్సికి ఈసారి కూడా ఆశించిన ఫలితం దక్కేలా లేదు. ట్రైలర్ లో కలిగిన ఆసక్తి అసలు కంటెంట్ లో లేకపోవడమే దీనికి కారణం.
తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చిన గాంధారిలో అసలేముందో చూద్దాం. కుటుంబంతో కలిసి రైల్లో ఊరికి వెళ్తున్న బని (తాప్సి) కూతురిని జాయ్ పుర స్టేషన్ లో గుర్తు తెలియని ఆగంతకులు కిడ్నాప్ చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోవడంతో బని అదే ఊళ్ళో ఉండి బిడ్డ జాడ తెలుసుకునేందుకు పూనుకుంటుంది. అయితే నిజాలు తెలుసుకునే కొద్దీ దీని వెనుక ఉన్న చీకటి రహస్యాలు, మాఫియా బయట పడతాయి. అవేంటనేది తెరమీద చూడాలి.
టైటిల్ గాంధారి అని ఎందుకు పెట్టారంటే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో హీరోయిన్ కళ్ళు పోతాయి కాబట్టి. ఈ ట్విస్ట్ మినహాయించి కథా నేపథ్యం గతంలో మర్దానీ లాంటి వాటిలో చాలా సార్లు చూసిందే కావడంతో అంత ఆసక్తి అనిపించదు. దర్శకుడు దేవాశీష్ మఖీజా స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం, ట్విస్టులు ఊహించేలా ఉండటం, కూతురి జాడ కన్నా జాయ్ పుర సీక్రెట్లను బయట పెట్టే తాపత్రయం ఎక్కువ చూపించడం ఫ్లోని బాగా దెబ్బ తీసింది. దీంతో రెండు గంటల నిడివి కూడా భారంగా అనిపిస్తుంది.
సో ప్రమోషన్లలో అంచనాలు రేపిన గాంధారి కంటెంట్ దగ్గర దొరికిపోయింది. అయిదేళ్ల క్రితం ధప్పడ్ తర్వాత తాప్సికి పెద్దగా హిట్టు రాలేదు. మొన్నామధ్య వచ్చిన అస్సి క్కూడా రొటీన్ కోర్ట్ డ్రామాగా తేలిపోగా ఖేల్ ఖేల్ మే, తడ్కా లాంటివి సోసోగా ఆడాయి. అయితే నెట్ ఫ్లిక్స్ మాత్రం తన బ్రాండింగ్ ని బాగా నమ్ముతోంది. ఆమె నటించిన సినిమాలు, సిరీస్ లు అధిక శాతం ఈ ప్లాట్ ఫార్మ్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏదైతేనేం ఖాళీ లేకుండా తాప్సి డైరీ బిజీగా అయితే ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates