కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్ రాజు. ‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రానికి బేసిగ్గానే మంచి హైప్ ఉంది. దీనికి తోడు దిల్ రాజు రంగంలోకి దిగి హైప్ ఇంకా పెంచాడు. ఆయన ఏ డబ్బింగ్ సినిమా హక్కులు తీసుకున్నా పెద్దగానే రిలీజ్ చేస్తాడు. ‘టాక్సిక్’కు హైప్ కూడా బాగానే ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ స్క్రీన్లలో ఆ సినిమాను దించేశారు.
ఐతే ‘టాక్సిక్’కు నెగెటివ్ రివ్యూలు రావడం.. సోషల్ మీడియా టాక్ కూడా దారుణంగా ఉండడంతో ఈ సినిమా మీద రూ.80 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన దిల్ రాజు పరిస్థితి ఏంటో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎంత భారీగా రిలీజ్ చేసినా, తొలి రోజు ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వచ్చేలా ఉన్నా.. పెట్టుబడిని రికవర్ చేయడం అసాధ్యమే. టాక్ చూస్తే సగానికి నష్టం గట్టిగానే ఉండబోతోందన్నది ట్రేడ్ వర్గాల మాట.
ఐతే ‘టాక్సిక్’ పరిస్థితి ఎలా ఉన్నా దిల్ రాజు సేఫే అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. సినిమా డిజాస్టర్ అయినా దిల్ రాజుకు ఇబ్బంది రాని విధంగా అగ్రిమెంట్ జరిగిందట. నష్టపోయిన మొత్తాన్ని 45 రోజుల్లో రికవర్ చేసేలా నిర్మాత వెంకట్.కె.నారాయణ హామీ ఇచ్చాడట. ఈ సినిమాకు బిగ్ రిలీజ్ దొరకడం, వీలైనంత భారీ ఓపెనింగ్ సాధించడం లక్ష్యంగా ఆయన, యశ్.. దిల్ రాజుతో మాట్లాడి ఆయనకు హక్కులు ఇచ్చారు. యశ్ కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.
అందుకే ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా భావించి భారీ తెలుగు మార్కెట్లో తన ముద్ర కోసం యశ్ రాజుతో చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయనతో ఒక సినిమా చేస్తానన్న హామీ కూడా యశ్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. భారీగా రిలీజ్ చేయడం, టికెట్ల రేట్లు పెంచడం ద్వారా తొలి వీకెండ్లో ప్రేక్షకుల నుంచి మాగ్జిమం కలెక్షన్లు లాగేయడానికి బాగానే ప్లానింగ్ జరిగింది. కాబట్టి రాజుకు ‘టాక్సిక్’ వల్ల ప్రయోజనమే తప్ప నష్టమేమీ లేదన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates